బ్రేకింగ్ : నంద్యాలలో వైసీపీ, టీడీపీ ఘర్షణ, ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు
నంద్యాలలో ఉద్రిక్తత తలెత్తింది. నంద్యాలలో మైనారిటీ నేత మరణించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైసీపీ, టీడీపీ నేతలు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటలతో ప్రారంభమైన వివాదం చివరకు ఘర్షణకు దారింది. నంద్యాలలో సూరజ్ హోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. శిల్పా మోహన్ రెడ్డి కారుకు అడ్డం తీయమని కోరగా ఈ వివాదం చోటు చేసుకుంది. శిల్పా వర్గీయులు టీడీపీ నేత అభిరుచి మధు కారుపై రాళ్లు రువ్వారు. దీంతో మధుకు సంబంధించిన గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో నంద్యాలలో టెన్షన్ నెలకొంది. పోలింగ్ రోజు ముగిసినా మళ్లీ గొడవలు జరగడంతో నంద్యాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాలిలోకి కాల్పులు జరిపిన గన్ మెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. టీడీపీ నేత ప్రయివేటు గన్ మెన్ కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. పోలీసులు వారిని మందలించే పరిస్థితి కూడా చేయలేదని శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. దౌర్జన్యాలకు భయపడేది లేదని ఆయన చెప్పారు.