ముద్రగడ ఉద్యమం కొనసాగితే వీరికి లాభమే.

Update: 2017-08-24 10:30 GMT

అక్కడేదో జాతర నడుస్తున్నట్లు గా వుంది తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి గ్రామం . కారణం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమం . చలో అమరావతి అంటూ ముద్రగడ పాదయాత్రకు పిలుపు ఇవ్వడం తదుపరి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం తెలిసిందే . తన పాదయాత్ర నిరవధికం అని ఏ రోజు ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తుందో ఆ రోజే యాత్ర ప్రకటించిన ముద్రగడ ఆ విధంగా జరిగే వరకు 13 జిల్లాలలోని కాపులు చలో కిర్లంపూడి అంటూ రావాలని పిలుపునిచ్చారు . మొదట్లో ఆయన పిలుపునకు పల్చగానే కాపులు వచ్చేవారు . రాను రాను ఇప్పడు నిత్యం వేలసంఖ్యలో కిర్లంపూడి కి తరలి వచ్చి ముద్రగడ పోరాటానికి సంఘీభావం ప్రకటించి వెళుతున్నారు .

చిరు వ్యాపారులకు డిమాండ్ ....

వందలు వేలసంఖ్యలో చలో కిర్లంపూడి అంటూ కాపులు తరలి రావడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో చిరు వ్యాపారులు చేసుకునే వారికి , హోటల్స్ నడిపే వారికి హుషారుగా వుంది .ఏ హోటల్ చూసినా , పాన్ బడ్డీ నుంచి , మిర్చి బజ్జీ ల వరకు ఒకటే డిమాండ్ నడుస్తుంది . ఇంటికి వచ్చే వారికి ఉప్మా ను అల్పాహారంగా అందించే అలవాటు వున్న ముద్రగడ ఎంత మంది వచ్చినా తన ఆతిధ్యం అందిస్తూనే వున్నారు . అయినప్పటికీ కిర్లంపూడి హోటల్స్ కిక్కిరిసి కనిపిస్తున్నాయి . పోలీస్ బృందాలు సైతం భారీగానే మోహరించి ఉండటంతో వారికి ఆహరం అందిస్తున్నారు స్థానిక వ్యాపారులు . దాంతో ఇప్పుడు చిరు వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సొమ్ములు వచ్చి పడుతున్నాయి . మరికొంత కాలం ఈ ఆందోళన ఇలాగే సాగాలని కొందరు వ్యాపారులు అనుకోవడం కూడా విశేషం.

Similar News