కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను కూడా నియోజకవర్గ ఎన్నికలాగానే టీడీపీ, వైసీపీ తీసుకున్నాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు ఓటర్లే ఎక్కువ. మొత్తం 48 డివిజన్లున్న కాకినాడ కార్పొరేషన్లో విజేతలను ఈ సామాజిక వర్గమే నిర్ణయిస్తుంది. అయితే కాకినాడ కార్పొరేషన్ కు ఒక చరిత్ర ఉంది. ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారే కాకినాడ కార్పొరేషన్ ను చేజిక్కించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి కార్పొరేషన్ తమేదనన్న ధీమాను టీడీపీ వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలకు, ముద్రగడ పాదయాత్రకు సంబంధం ఉందంటున్నారు. గత 27 రోజుల నుంచి కాపు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర చేయనివ్వకుండా ముద్రగడను అడ్డుకోవడాన్ని కాపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గ నేతలు కూడా సమావేశమై ముద్రగడకు జరుగుతున్న అవమానంపై కూడా చర్చించారు.
టీడీపీకి తప్ప ఎవరికైనా......
అయితే ముద్రగడ పరోక్ష ప్రచారాన్ని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రారంభించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కిర్లంపూడిలో ఉన్న ముద్రగడకు కాపు ఓటర్ల జాబితాను అందించారు. ఈ జాబితా ప్రకారం వారికి ముద్రగడే స్వయంగా ఫోన్లు చేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెబుతున్నారు. కాపులను మోసం చేసిన టీడీపీకి తప్ప ఎవరికి ఓటు వేసినా పరవాలేదని ఆయన స్వయంగా ఫోన్లు చేసి చెబుతుండటంతో టీడీపీకి కొంత ఇబ్బందిగా మారింది. కాపు రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పదేపదే చెబుతున్నప్పటికీ ముద్రగడ వ్యవహారం టీడీపీ నేతలకు నచ్చడం లేదు. మంజునాధ కమిషన్ నివేదిక అందగానే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ చెబుతున్నా.... కాకినాడలో మాత్రం ముద్రగడ ఫోన్లు తమకు దెబ్బతీస్తాయోమోనన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముద్రగడకు సన్నిహితంగా ఉండి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న ఇద్దరు కార్పొరేటర్లు తమకు మద్దతివ్వాలని వెళ్లినా ఆయన సున్నితంగా తిరస్కరించడంతో టీడీపీ నేతలకు ముద్రగడ ఫోన్ల భయం పట్టుకుంది. తనను నిర్భంధించిన ప్రభుత్వంపై కసి తీర్చుకోవడానికి ముద్రగడ కాకినాడలో శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.