జనసేన అధినేత నిప్పులు చెరిగారు. మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఎవరినీ వదలకుండా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆపగలిగారు గాని దాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. చంద్రబాబు గారూ మీరు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఒక్క గంట అనుమతిచ్చి ఉంటే బాగుండేది. కాని అణగదొక్కే ప్రయత్నం చేశారు. మీరు ఉద్యమాన్ని కొద్దిరోజులు ఆపగలిగారు కాని దాన్ని వాయిదా వేసినట్లు గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు తెలిపారు. చంద్రబాబుకు పరిపాలనా సామర్ధ్యం ఉందని భావించే ఆయనకు మద్దతిచ్చానని, ఆయన వెనకున్న సుజనా చౌదరి ,రాయపాటిలను పక్కన పెట్టాలని కోరారు. వారిద్దరి అవినీతిపై నిపుణుల కమిటీ వేయాలని పవన్ డిమాండ్ చేశారు. సుజనా చౌదరి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పందుల పందేలతో పోల్చారని, రాయపాటి పోలవరం కాంట్రాక్టు తీసుకుని రైతుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పక్కన ఉన్నవాళ్లే ఆయనకు చేటు తెస్తున్నారన్న పవన్ ఇదే పద్ధతిని కొనసాగిస్తే తాను రోడ్డు మీదకొచ్చి నిరసన తెలపాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 12 గంటల్లో విడగొట్టారని, ప్రత్యేక ప్యాకేజీ కూడా అర్ధరాత్రి ప్రకటించారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏం లాభమో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ మీ పరిపాలన అనుభవం చూసి మద్దతిచ్చానని, ఇలాగే మీ తీరు కొనసాగితే తాను ఆలోచించుకోవాల్సి వస్తుందని చంద్రబాబుకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అప్పడు టీడీపీకి మద్దతిచ్చింది కేవలం కాంగ్రెస్ సమస్యలను నీరుగారుస్తుందనే. అయితే ఇప్పుడ ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదని, బీజేపీ పాలనలాగానే నడుస్తుందన్నారు.
వెంకయ్యపై ఫైర్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని చెప్పిన వెంకయ్య నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని అన్నారు. వెంకయ్యనాయుడికి స్వర్ణభారతి ట్రస్ట్ పై పెట్టిన మనసు ప్రత్యేక హోదాపై పెట్టుంటే అది వచ్చేదన్నారు. వెంకయ్య నాయుడు ఢిల్లీ రక్షణ కవచంలో కూర్చుని మాట్లాడుతున్నారని, నాలుగు కోట్ల మంది ప్రజలు కట్టుబానిసలు కాదని గుర్తుంచుకోవాలన్నారు. తాను ఎన్నికలప్పుడు మద్దతిచ్చినప్పుడు తనకు అవగాహన లేదని బీజేపీ నేతలు అనలేదని, ఇప్పుడు విమర్శిస్తుంటే మాత్రం తనకు అవగాహన లేదంటున్నారన్నారు. ఆరోజు ఎన్నికల్లో తనను తమిళనాడు, కర్ణాటకకు కూడా ప్రచారానికి పంపారు. అవగాహన లేకుంటే ఎందుకు పంపారని ఆయన ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రత్యేక హోదాపై మాటిచ్చి వెనక్కు తీసుకోవడం సరికాదన్నారు.
మోడీపై మండిపాటు
మోడీ నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్నారని పవన్ మండిపడ్డారు. రోహిత్ వేముల విషయలోగాని, నోట్ల రద్దు విషయంలో ప్రజాభిప్రాయాన్ని పక్కన బెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఉత్తరాది నేతలకు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారన్నారు. ఏపీని విభజించినప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలను ఎందుకు విభజించలేదని పవన్ ప్రశ్నించారు. ఇదే పద్ధతి కొనసాగితే బానిసలుగా మీరు చూస్తున్న ప్రజలు తిరగబడే రోజొస్తుందని హెచ్చరించారు. తమిళనాడుకు షూటింగ్ నిమిత్తం తాను రెండు నెలల క్రితం వెళ్లానని, అయితే అక్కడ జయలలిత మరణం తర్వాత బీజేపీ జోక్యాన్ని యువత సహించలేకపోయిందన్నారు. జల్లికట్టు ఒక కారణమేనని, ఆ నిరసన బీజేపీ ప్రభుత్వంపైనే అన్నది తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో 1500 మంది చినిపోతే కాని ఢిల్లీలో జాతీయ వార్త కాలేదని, కాని ఢిల్లీలో తుమ్మినా..దగ్గినా వార్తవుతుందన్నారు. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపితే ఊర్కొనేది లేదని హెచ్చరించారు.