వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. వ్యక్తిగత గోప్యతకు పరిమితి ఉంటుందని కేంద్రం వాదిస్తున్న నేపథ్యంలో 9మంది న్యాయమూర్తుల ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు శాసించడంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ తప్పని సరి చేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపౌరుడు 12 అంకెల ఆధార్ నంబరు కలిగి ఉండాలనడంపై ఈ తీర్పును వెలువరించింది. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ప్రకటించింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని వాదించింది. ఆధార్ విధానాన్ని ప్రకటించినపుడు అది స్వచ్ఛంధంగా ధృవీకరణ కోసం చేపట్టిన కార్యక్రమంగా ప్రకటించారని., ఆ తర్వాతి కాలంలో అన్ని ప్రభుత్వ పథకాలు., కార్యక్రమాలకు దానిని తప్పనిసరి చేయడాన్ని పిటిషనర్ సవాలు చేశారు. మరోవైపు ఆధార్ కోసం ఐరిస్., ఫింగర్ ప్రింట్లను సేకరించడంపై దాఖలైన అభ్యంతరాలను మరో బెంచ్ పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు ప్రకటించింది. పిటిషినర్ తరపున న్యాయనిపుణుడు గోపాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ విధానాలను సవాలు చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే స్వేచ్ఛను ప్రసాదించిందని అందులో వ్యక్తిగత గోప్యత అంతర్భాగమని దానిని ఏ ప్రభుత్వం శాసించలేదని., అలా చేస్తే అది రాజ్యాంగం స్ఫూర్తికి విఘాతం కలిగించడమేనన్నారు. వ్యక్తిగత గోప్యతలోకి ఎవరు ప్రవేశించలేరని కాని చట్టాల మాటున ప్రభుత్వం అలాంటి దుస్సహాసం చేయడం తగదని వాదించారు. పన్ను చెల్లింపులు., బ్యాంకు అకౌంట్లను తెరవడం వంటి వాటికి ఆధార్ తప్పని సరి చేయడాన్ని తప్పు పట్టారు. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీం తీర్పు వెలువరించింది.