లేడీ డాన్‌ ఆత్మహత్యాయత్నం?

Update: 2017-08-24 09:17 GMT

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన సంగీతా ఛటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా సబ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగీతా ఛటర్జీ గురువారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సహకరించిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంగీతా చటర్జీని చిత్తూరు జిల్లా పోలీసులు గత ఏడాదే అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన సంగీతా ఛటర్జీని గత మార్చిలో పక్కా వ్యూహంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కత్తాలోని కస్బారోడ్‌లో అరెస్ట్‌ చేసిన తర్వాత చిత్తూరు తరలించి రిమాండ్‌కు పంపారు. నిజానికి గత ఏడాది జూన్‌లో సంగీతాను పోలీసులు అరెస్ట్‌ చేసినా స్థానిక న్యాయవాదుల అండతో పోలీసుల నుంచి తప్పించుకుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో 2014లో లక్ష్మణ్‌ మార్కొండ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినా తీరు మార్చుకోలేదు.

సంగీత పరిస్థితి విషమమా?

విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు గుర్తించి లక్ష్మణ్‌ను తిరిగి అరెస్ట్‌ చేసిన సమయంలో సంగీతా పేరు బయటకు వచ్చింది. లక్ష్మణ్‌ రెండవ భార్య అయిన సంగీత గతంలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసేది. మోడలింగ్‌., ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసే సంగీత ద్వారా దుబాయ్‌., చైనా., హాంకాంగ్‌లోని బయ్యర్లకు ఎర్రచందనం విక్రయాలు చేసేిది. నగదు ఆమె ఖాతాలకు బదిలీ అయ్యేది. స్మగ్లింగ్‌ ద్వారా సంపాదించిన నగదు., నగలు., విదేశీ కరెన్సీ కలకత్తలోని యూకో బ్యాంకులో దాచినట్లు గుర్తించి సీజ్‌ చేశారు. ఆమె లాకర్ల నుంచి 2.158 కేజీల బంగారం., విదేశీ కరెన్సీతో పాటు 25 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు., కోర్టులు విచారణకు హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినా ఆమె స్పందించకపోవడంతో చివరికి గత మార్చిలో వలపన్ని పట్టుకున్నారు. అప్పట్నుంచి రిమాండ్‌లో ఉన్న సంగీతా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Similar News