వచ్చే ఎన్నికలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. అంత వరకూ ఓకే. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పిన పవన్ కల్యాణ్ అందుకు అనుగుణంగానే కసరత్తులు కూడా చేస్తున్నారు. కాని జనసేన అధినేత వ్యవహార శైలిని చూస్తున్న వారికి ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్నారు. అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో వస్తానన్న జనసేనాని రధయాత్రకు కూడా ప్లాన్ చేసుకున్నారు. రధయాత్రకు అవసరమైన రూట్ మ్యాప్ ను కూడా జనసేన పార్టీ కార్యాలయం సిద్ధం చేస్తోంది. పవన్ ప్రయాణించే వాహనం కూడా రెడీ అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో పర్యటించాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది. అయితే తొలుత ఏపీలోని అనంతపురం నుంచే ఈయాత్ర కొనసాగుతుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఏపీలో పర్యటన పూర్తయిన తర్వాత తెలంగాణాలోనూ పవన్ పర్యటిస్తారని జనసేన పార్టీ నేత ఒకరు తెలుగు పోస్ట్ కు చెప్పారు. అక్టోబర్ నుంచి పవన్ పాలిటిక్స్ పై సీరియస్ గానే దృష్టిపెట్టినట్లు చెప్పారు.
ఏపీలో ఒంటరిగా...తెలంగాణలో పొత్తుతో....
అయితే ఏపీలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని జనసేన అధినేత ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటుగా బీజేపీని కూడా దూరం పెట్టాలని పవన్ భావిస్తున్నారు. అందుకోసమే నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వైఖరి తటస్థమేనని పవన్ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఏపీలోనూ కమ్యునిస్టులతో కూడా పవన్ కలిసే అవకాశం లేదంటున్నారు. త్రిముఖ పోటీ ఉంటే ఏపీలో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై కూడా పవన్ ఆరాతీశారట. అయితే 2019 ఎన్నికల్లోనే తమకు అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష లేదని, పార్టీని పటిష్టపర్చి ఎప్పటికైనా ఏపీలో జనసేన జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతోనే పనిచేయాలని జనసైనికుల శిక్షణ శిబిరంలో పవన్న చెప్పారు. తెలంగాణలో మాత్రం భావసారూప్యత కల్గిన పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ స్ట్రాటజీ వచ్చే ఎన్నికల్లో వర్క్ అవుట్ అవుతుందా? చూడాలి మరి.