వైసీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటన వైసీపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం లేదని వైసీపీ సీనియర్లు భావించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జగన్ తో చెప్పారు. అయినా జగన్ మోడీ సర్కార్ తో సంబంధాలు పెంచుకోవడానికే ప్రయత్నించారు. మోడీతో మాటా మంతీ నెరిపారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిచ్చారు. అయితే తనన ఇంతలా హింస పెట్టిన కాంగ్రెస్ కు మద్దతివ్వలేకనే జగన్ బీజేపీకి సపోర్ట్ చేశారంటున్నారు వైసీపీ నేతలు. అయినా వైసీపీలో కొందరు ముఖ్యులు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని జగన్ కు చెప్పారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆలోచన కూడా ఇదే విధంగా ఉండటంతో జగన్ బీజేపీతో సత్సంబంధాలకు ఒక అడుగు ముందుకు వేశారు.
బీజేపీ వల్ల నష్టమేనంటున్న వైసీపీ నేతలు......
అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఓట్లే ఎక్కువగా ఉంటాయన్నది విశ్లేషకుల అంచనా. విభజన చట్టంలోని హామీలను అమలుపర్చక పోవడం, ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కడం, రైల్వేజోన్ ప్రకటించక పోవడం వంటి కారణాలతో ఏపీ ప్రజలు బీజేపీ పట్ల కొంత వ్యతిరేకతతోనే ఉన్నారు. అంతేకాకుండా ఏపీలో బీజేపీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. కొన్ని ప్రాంతాల్లో తప్ప బీజేపీ వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశమూ లేదు. ఇక మోడీ చరిష్మా మీదనే ఏపీ బీజేపీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. మూడున్నరేళ్ల కాలంలో మోడీ ఏపీకి పెద్దగా చేసిందేమీ లేకపోవడం, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు ప్రతికూలంగానే కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడమే మేలన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమిత్ షా ప్రకటనతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారని చెబుతున్నారు. ఇక ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానకెత్తుకుని ఓటు బ్యాంకు ను పెంచుకోవాలన్నది వైసీపీ నేతల వ్యూహంగా కన్పిస్తోంది.