వైసీపీ తరుపున జోరుగా బెట్టింగ్ లు

Update: 2017-08-24 07:30 GMT

నంద్యాల ఉప ఎన్నిక టగ్ ఆఫ్ వార్ గా నడవటం, పోలింగ్ విపరీతంగా పెరగడంతో బెట్టింగ్ లు ఊపందుకున్నాయి. టీడీపీ, వైసీపీ అభిమానులు, నేతలు పెద్దయెత్తున బెట్టింగ్ కాస్తున్నారు. గత పది రోజులుగా నంద్యాల ఉప ఎన్నికపై బెట్టింగ్ నడుస్తున్నప్పటికీ నిన్న పోలింగ్ తర్వాత అంచనాలు అందని విధంగా తయారయింది. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తమదే విజయమని ధీమాను వ్యక్తం చేయగా, మంత్రి అఖిలప్రియ కూడా అదేస్థాయిలో తమదే నంద్యాల అని చెప్పడం విశేషం. దీంతో ఇరు పార్టీల నేతలు గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్న తరుణంలో బెట్టింగ్ లు ఊపందుకున్నాయి. పోలింగ్ శాతం విపరీతంగా పెరగడం, గ్రామీణ ప్రాంతాలు క్యూ కట్టడం, ముస్లిం ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుందన్న ఆరాలు తీసి మరీ బెట్టింగ్ కాస్తున్నారు.

లక్షల్లో బెట్టింగ్ లు....అగ్రిమెంట్లు......

ముఖ్యంగా వైసీపీ మీద బెట్టింగ్ లు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలతో పాటుగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ బెట్టింగ్ ల జోరు ఎక్కువగా కన్పిస్తోంది. హైదరాబాద్ లో వ్యాపారులు కూడా బెట్టింగ్ లకు దిగడం విశేషం. కూకట్ పల్లిలోని వ్యాపారులు వైసీపీ తరుపున లక్షకు రెండు లక్షలు బెట్టింగ్ లు కాస్తున్నారు. కేపీహెచ్బీ కి చెందిన ఒక వ్యాపారి వైసీపీ తరుపున దాదాపు 20 లక్షలు బెట్టింగ్ కాశారు. బెట్టింగ్ లు కాయడమే కాదు అగ్రిమెంట్లు కూడా రాసుకుంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా వైసీపీ తరుపున బెట్టింగ్ ల జోరు ఎక్కువగా కన్పిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి యాభై లక్షల రూపాయలు టీడీపీ పై పందెం కాశారు. మీడియా ప్రతినిధులను ఆరాతీయడం, సన్నిహితుల ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్న పందెంరాయుళ్లు అధిక మొత్తంలోనే బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. 28వ తేదీన గాని బెట్టింగ్ రాయుళ్లకు స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Similar News