కేంద్ర మంత్రి వర్గ విస్తరణ శనివారం జరిగే అవకాశముంది. ఇందుకోసం కసరత్తులు జరగుతున్నాయి. ఈ నెల 26వ తేదీన కేంద్ర మంత్రి వర్గవిస్తరణ జరగనున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలోనే కసరత్తులు చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఖాళీలను పూరించడంతో పాటుగా కొత్తగా ఎన్డీఏలో చేరిన వారికి కూడా విస్తరణలో అవకాశం కల్పించనున్నారు మోడీ. రక్షణశాఖ, అటవీ, పర్యావరణ శాఖ, సమాచార, పట్టణాభివృద్ధి శాఖల వంటి కీలకమైన వాటిని భర్తీ చేయాల్సి ఉంది. సరిహద్దుల్లో చైనాతో తలెత్తుతున్న ఉద్రిక్తపరిస్థితుల్లో పూర్తి స్థాయి రక్షణ మంత్రి లేకపోవడం విడ్డూరమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్న నేపథ్యంలో మోడీ శనివారమే మంత్రి వర్గ విస్తరణ చేపడతారంటున్నారు.
కొత్త వారికే చోటు.....
ఈ విస్తరణంలో ఇటీవల ఎన్డీఏలో చేరిన జేడీయూ, అన్నాడీఎంకేలకు కూడా పదవులు దక్కే అవకాశముంది. అన్నాడీఎంకేకు రెండు కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చే అవకాశముందంటున్నారు. ఇక జేడీయూ నుంచి కడా ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశముంది. వీరితో పాటుగా వయసు పైన పడటంతో కల్ రాజ్ మిశ్రాను తప్పించనున్నారు. పనితీరు బాగాలేని మరికొందరిని కూడా మంత్రి వర్గం నుంచి తప్పించి యువతకు చోటు కల్పించాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక నుంచి కొత్తవారికి ఛాన్స్ దొరికే అవకాశముందంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరుంటున్నారన్నదే సస్పెన్స్ గా ఉంది. ఏపీ నుంచి ఒకరికి అవకాశముంటుందని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.