వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది. శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు అతడి దగ్గర బంధువులు ఆదిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో పది మందిపై కేసు నమోదయింది. టీడీపీ నేత అభిరుచి మధు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయులు, టీడీపీ నేత మధు వర్గీయులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మధు ప్రయివేటు గన్ మెన్ ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. టీడీపీ నేత మధు కత్తితో వీరంగం చేయడం కూడా కన్పించింది. కాని మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది అధికారపార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, ఘర్షణకు కారణమైన మధును వదిలేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.