శ్రీదేవి మృతి కేసు క్లోజ్

Update: 2018-02-27 12:52 GMT

లెజండరీ నటి శ్రీదేవి మృతి కేసును మూసేసినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. పోలీసులు, ఫోరెన్సిక్ రిపోర్టులలో ఎలాంటి లోపం లేదని ప్రాసిక్యూషన్ తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు ప్రాసిక్యూషన్ కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి రిలయన్స్ ప్రయివేట్ జెట్‌లో నేరుగా ముంబైకు బయలుదేరారు. ఈరాత్రికి శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రీదేవి నివాసానికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే చాలామంది ముంబైలోని శ్రీదేవి నివాసానికి చేరుకుని ఆమెను కడసారి చూసేందుకు వేయి కన్నులతో వేచి చూస్తున్నారు.

ఎలాంటి అనుమానాలు లేవు....

ఈ నెల 20న దుబాయ్‌లో జరిగిన తమ బంధువుల పెళ్లికి వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ హోటల్ రూమ్‌లో ఈ నెల 24 రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. హోటల్ రూమ్‌లోని బాత్‌టబ్‌లో శ్రీదేవి మరణించినట్లు గుర్తించారు. అయితే శ్రీదేవి బంధువులు ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించగా.. పోస్టుమార్టం రిపోర్టులో ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి ఊపిరాడక మరణించినట్లు వైద్యులు పేర్కొనడంతో ఆమె మృతిపై అనుమానాలు వచ్చాయి. దీంతో దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదలాయించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టులతో పాటు తమకు అనుమానమున్న ప్రతి చోటా పరిశీలించి విచారణ జరిపిన ప్రాసిక్యూషన్.. ఆమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడడం వల్లే చనిపోయిందని తేల్చారు. మొత్తంగా శ్రీదేవి మృతి మిస్టరీ వీడడంతో కేసును క్లోజ్ చేసి భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించేందుకు ప్రాసిక్యూషన్ అనుమతిచ్చింది.

Similar News