సన్ రైజ్ స్టేట్ అంటే ఇదేనా బాబూ?

Update: 2017-10-18 01:30 GMT

పవర్ పాయింట్ ప్రజెంటేషన్... తర్వాత చంద్రబాబు ప్రసంగం... ఆ తర్వాత చప్పట్లు... ఆహుతులందూ స్టాండింగ్ ఓవేషన్... ఇలా సాగిన సీఐఐ సమ్మిట్ .. పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఏపీ సర్కార్ ప్రకటించుకుంది. సరిగ్గా ఈ ఏడాది జనవరి 27వ తేదీన సీఐఐ సమ్మిట్ విశాఖలో జరిగింది. పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సమ్మిట్ తో వచ్చాయని చెప్పింది. 665 మందితో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పింది. మొత్తం 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఊదరగొట్టింది. కాని నెలలు గడుస్తున్నా అవగాహన ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ఎక్కడికి పోయాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ఏడాది జనవరి 27న విశాఖ తీరంలో జరిగిన సమ్మిట్ కు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు, 1000 మంది వరకూ డెలిగేట్స్ హాజరయ్యారు. రోజుకోకేంద్రమంత్రి వచ్చి ఏపీని పొగిడేసి వెళ్లిపోయారు. పరిశ్రమలు, రోడ్లు, ఇంధనరంగం, మైనింగ్, ఆహారశుద్ధి, పర్యాటకరంగం, ఐటీ, జౌళి, ఉన్నత విద్యారంగంలో ఈ పెట్టుబడులు ఎక్కువ వచ్చినట్లు చంద్రబాబు ఆర్భాటంగా వివరించారు.

తొమ్మిది నెలల్లో.....

అయితే సీఐఐ సదస్సులో జరిగిన ఒప్పందాలు ఏపీకి వచ్చింది అంతంత మాత్రమే. చిన్నా చితకా రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలు ఒకటి రెండు చోట్ల పెట్టుబడులు పెట్టారు తప్పించి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న మల్టీ నేషనల్ కంపెనీలు ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఏపీలో సరైన వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించకపోవడం, అధికారులు సక్రమంగా స్పందించకపోవడం వల్లనే అని చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపారు. కాని అక్కడ స్థలం సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పాటు రవాణా సౌకర్యాలుకూడా ఇంకా సమకూరకపోవడం వల్లనే పరిశ్రమల ఏర్పాటుకు పెద్దగా ముందుకు రాలేదని సమాచారం. కాని పదిలక్షల కోట్లలో లక్ష కోట్ల పెట్టుబడులను కూడా ఏపీ సర్కార్ గ్రౌండ్ చేయలేకపోయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సన్ రైజ్ స్టేట్ గా చెప్పుకునే చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలంటున్నాయి విపక్షాలు. పెట్టుబడులు అంతా కనికట్టు... అని అంకెల గారడీ మాత్రమేనంటున్నాయి. 22 లక్షలమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం పది వేల మందికి కూడా ఉపాధి చూపలేకపోయింది.

Similar News