సిఐఏ చేతికి ఆధార్‌ డేటా.....?

Update: 2017-08-26 17:30 GMT

వ్యక్తిగత గోప్యతపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన రోజుల వ్యవధిలోనే మన గోప్యత దేశం దాటిపోయిందని తేలిపోయింది. 100కోట్ల మందికి పైగా భారతీయుల వ్యక్తిగత సమాచారం ఇప్పటికే అమెరికా గూఢచార్య సంస్థ సిఐఏ చేతికి డాటాబేస్‌ మొత్తం చేరిపోయిందని వికిలీక్స్‌ ఆరోపించింది. భారత పౌరుల సమాచారం మొత్తం ఉద్దేశపూర్వకంగానే అమెరికాకు లీక్‌ అయ్యిందని వికీలీక్స్‌ ఆరోపించింది. ఆధార్‌ కార్డుల సమాచారంతో పాటు వాటికి అనుసంధానమై ఉన్న బ్యాంకింగ్‌., టెలికాం వివరాలు కూడా అమెరికాకు చేరాయని వికీలీక్స్‌ ఆరోపించింది. ఆధార్ బయోమెట్రిక్‌ సమాచారానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అమెరికాకు చెందిన క్రాస్‌ మ్యాచ్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఇదే సంస్థ తయారు చేసిన ఎక్స్‌ప్రెస్‌ లేన్‌ టూల్‌ ద్వారా డేటా లీక్‌ అయినట్లు వికీలీక్స్‌ ఆరోపించింది. దీని ద్వారా భారత పౌరుల వేలిముద్రలు., ఇతర బయోమెట్రిక్‌ సమచారాన్ని అమెరికా రక్షణ సంస్థలు కూడా వినియోగించుకునే వీలుకలుగుతుంది.

ఏంటీ ప్రాజెక్ట్‌.....

అమెరికా సిఐఏ అభివృద్ధి చేసిన ఎక్స్‌ప్రెస్‌ లేన్‌ ప్రాజెక్టు పత్రాలను వికీలీక్స్‌ విడుదల చేసింది. ఎక్స్‌ప్రెస్‌ లేన్‌ ద్వారా అమెరికాలోని నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ., డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోం లాండ్‌ సెక్యూరిటీ., ఎఫ్‌బిఐలతో పలు సంస్థల ద్వారా అందుతున్న సేవల్ని పరిశీలించడానికి వీలు కలుగుతుంది. సిఐఏ అనుబంధ సంస్థ అయిన ఆఫీస్‌ ఆఫ్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌కు బయోమెట్రిక్‌ సమాచారాన్ని సేకరించే వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. అయితే దీనికి కొంత పరిమితి ఉండటంతో ఎక్స్‌ప్రెస్‌ లేన్‌ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా బయోమెట్రిక్ సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా సేకరించడానికి వీలవుతుంది. బయోమెట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ రూపంలో కంప్యూటర్లలోకి చొరబడేలా దీనిని అభివృద్ధి చేశారు. దీంతో బయోమెట్రిక్‌ వినియోగించే వారు కూడా పెద్దగా సందేహించరు. సిఐఏ-ఓటిఎస్‌లు వినియోగింే సాఫ్ట్‌వేర్‌లు., ఉత్పత్తులు క్రాస్‌ మ్యాచ్‌ సంస్థ తయారు చేస్తుంది. 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా సైన్యం ఇదే సంస్థ సహకారం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థ సహకారంతో అబొట్టాబాద్‌లో లాడెన్‌ దాగి ఉన్నాడని గుర్తించారు.

ఆధార్‌కు అవే సేవలు......

అమెరికా వెలుపల ఆధార్‌ ప్రాజెక్టుకే క్రాస్‌ మ్యాచ్‌ సంస్థ బయో మెట్రిక్ సేవలు అందించింది. 2011లో భారత ప్రభుత్వం ఈ సంస్థ సేవలకు అమోదం తెలిపింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన గార్డియన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌., ఐ స్కాన్‌ యంత్రాలను 2011 అక్టోబర్‌ 7న భారత ప్రభుత్వం అమోదించింది. క్రాస్‌ మ్యాచ్‌ సంస్థ పేటెంట్‌ కలిగిన ఆటో క్యాప్చర్‌ ఫీచర్‌ను ఈ యంత్రాలు కలిగి ఉంటాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ., ఎస్‌టిక్యూసి సంస్థలు పరీక్షించిన తర్వాత వీటికి అమోదం తెలిపాయి. 2012 క్రాస్‌ మ్యాచ్‌ నుంచి ఫ్రాన్సిస్కో సంస్థ మేధో హక్కులు పొందింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. 80దేశాల్లో రెండున్నర లక్షల యంత్రాలను ఈ సంస్థ ఇప్పటికే విక్రయించింది. క్రాస్‌ మ్యాచ్‌., ఫ్రాన్సిస్కో సంస్థల సేవలు పొందుతున్న వాటిలో అమెరికా రక్షణ విబాగాలే ఎక్కువ. ఇక ఫ్రాన్సిస్కోకు ఇజ్రాయెలీ సైబర్‌ వెపన్స్‌ గ్రూప్‌లో భాగస్వామ్యం ఉంది.....అరబ్‌., మెక్సికోలలో హక్కుల కార్యకర్తలపై దాడుల వెనుక ఈ సంస్థల సైబర్‌ గూఢచార్యం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఆధార్‌ భారీ మార్కెట్....

భారత్‌లో ప్రతి పౌరుడి వివరాలు సేకరించే లక్ష్యంతో చేపట్టిన యునిక్‌ ఐడి ప్రాజెక్టు క్రాస్‌ మ్యాచ్‌ సంస్థకు భారీగా కాసులు కురిపిస్తోందని వికీలీక్స్‌ వెల్లడించింది. కేవలం క్రాస్‌ మ్యాచ్‌ సాంకేతిక పరిజ్ఞానం రూపొందిన యంత్రాలతోనే బయో మెట్రిక్‌ యంత్రాలు తయారవుతాయి. ఈ సంస్థకు భారత్‌లో స్మార్ట్‌ ఐడెంటిటీ డివైసెస్‌ అనే సంస్థ భాగస్వామిగా ఉంది. స్మార్ట్‌ ఐడి తయారుచేసిన యంత్రాలనే భారత్ మొత్తం ఆధార్‌ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. సమాచారం సేకరణ., ఆధార్‌ కార్డు ప్రింటింగ్‌., ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థే అందిస్తోంది. 2008లో నోయిడాలో కార్యకలాపాలు ప్రారంభించిన స్మార్ట్‌ ఐడి సంస్థ యంత్రాలే ఇప్పుడు ఆధార్‌లో కీలకం అయ్యాయి. అమెరికా తయారు చేసిన ఎక్స్‌ప్రెస్‌ టూల్‌ సహకారంతో భారత్‌లో ఆధార్‌ ఆధారంగా జరుగుతోన్న అన్ని రకాల డేటా అప్‌డేట్‌లను ప్రత్యక్షంగా రియల్‌ టైమ్‌లో తెలుసుకునే వీలు కలుగుతోందని వికీలీక్స్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

Similar News