తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు శుక్రవారం నాడు చాలా ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దు గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గనుక పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే దేశంలో అద్భుతాలు జరుగుతాయని కేసీఆర్ సెలవిచ్చారు. తమ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నదని.. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన చెప్పారు.
నోట్ల రద్దు అంశంపై సభలో చర్చించడానికి తాము సిద్ధంగానే ఉన్నాం అని.. అయితే విపక్షాలు నోట్ల రద్దు వలన తలెత్తుతున్న ప్రజల సమస్యలను మాత్రమే ప్రస్తావించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. తద్వారా విపక్షాల ముందరి కాళ్లకు ఆయన బంధాలు వేయడానికి ఓ ప్రయత్నం చేశారు. డిజిటల్ లావాదేవీలు పూర్తిస్థాయిలో అమలైతే రాష్ట్రప్రభుత్వం ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నదంటూ కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు అనే వ్యవహారం ఓ పెద్ద కుంభకోణం అని, దాని వెనుక చాలా పెద్ద అవినీతి బాగోతం దాగి ఉన్నదని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న తరుణంలో మొదలవుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే.. ఇక్కడి కాంగ్రెస్ వారు కూడా అదే పాటను ఇక్కడ కొనసాగించే అవకాశం ఉన్నది. అదే జరిగితే టీ అసెంబ్లీ చర్చ అటు కేంద్రానికి, వారి నిర్ణయాన్ని సమర్థిస్తున్న రాష్ట్ర సర్కారుకు కూడా ఇబ్బందికరం అవుతుంది.
పైగా నోట్ల రద్దు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోందంటూ తొలుత వ్యతిరేకించి.. ఆ పిమ్మల మోదీని కలిసిన తర్వాత.. ఏకపక్షంగా దానిని సమర్థించిన కేసీఆర్ తీరు మీద కూడా కాంగ్రెస్ పార్టీ రకరకాల అనుమానాలు రేకెత్తిస్తూ.. గతంలో విమర్శలు చేసింది. సభలో చర్చ అంటూ జరిగితే.. ఆ అంశాలు, ఆరోపణలు అన్నిటినీ వారు తిరగతోడే ప్రమాదం ఉన్నది. అందుకే అలాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలకు ముందే బ్రేకులు వేస్తున్నట్లుగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యల మీద మాత్రమే చర్చ జరగాలంటూ ఆయన హితవు చెప్పేశారు.
ఈ అంశాలన్నీ బాగానే ఉన్నప్పటికీ.. సైబర్ నేరాల గురించి మాత్రం కేసీఆర్ పలుచనగా మాట్లాడడమే భయం గొలుపుతోంది. తెలంగాణ ప్రజల్లో డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచడానికి పెద్దస్థాయిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడం వరకు ఓకే. అయితే సైబర్ నేరాలు ఎప్పుడూ ఉండేవేనని.. వాటిగురించి ఈ అంశంతో ముడిపెట్టవద్దని చెప్పడం మాత్రం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. డిజిటల్ లావాదేవీల గురించి అవగాహన కల్పించడంలో భాగంగానే.. సైబర్ నేరాల అవగాహన, వాటి బారిన పడకుండా లావాదేవీలు నడపగల చైతన్యం ప్రజలకు కలిగించడం అవసరం. డిజిటల్ వ్యవహారాలపై ఎంత అవగాహన ఉండాలో.. దానికి పొంచి ఉండే ప్రమాదాల గురించి కూడా అంతే చైతన్యం ఉండాలి. లేకుంటే.. ప్రజలు తరచూ నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది.
కాబట్టి సీఎం కేసీఆర్ డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు, సైబర్ నేరాల గురించి కూడా సమానంగా దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.