స్పెషల్ పార్టీ పేరుతో పోలీసుల దందా...!

Update: 2018-02-22 02:26 GMT

నగరంలో పోలీసుల అవతారంలో కేటుగాళ్లు లక్షలు వసూలు చేయడానికి మకాం వేసి కూర్చుకున్నారు. ఉద్యోగంలోకి వచ్చిందే సంపాదించడానికి అనుకునే ఈ మోసగాళ్లు పెద్ద సార్లను వదలరూ.. మాముళ్ల మత్తులో ఆ ఆఫీసర్లని ఉంచి దందా కొనసాగిస్తున్నారు. సారు పేరు వాడుకోని ఏడాదికి కొట్లాది రూపాయలు దండుకుంటున్నారు. అక్రమాలు అని తెలిసినా.. ఎవరూ నోరు విప్పరు..చిన్నపాటి కేసుతో ఈ దందా పై పోలీస్ బాస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

ప్రపంచ నగరాల్లో ఒకటిగా చేయాలని....

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచనగారాల్లో ఒకటిగా నిలబెట్టాలనే తపన డిజిపి మహేందర్ రెడ్డిది. ప్రభుత్వానికి పెట్టుబడులకు పెట్టిన కోటలా హైదరాబాద్ ఉండాలంటే పోలీసులదే కీలక పాత్ర. కాని జోన్లలో ఉండే ఐపీఎస్ ల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. డిసిపి ల పేర్లు చెప్పుకోని ఓ గ్యాంగ్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. గతంలో ఈ ముఠాల పై ఫిర్యాదులు అందగా.. అప్పడు సి.పి.గా ఉన్న మహేందర్ రెడ్డి స్పెషల్ పార్టీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. కాని అవే దందాలు అనాధికారికంగా కొనసాగించడం అలవాటుగా మారింది ఇప్పుడున్న డిసిపిలకు .. సార్‌ చెప్పారు.. మీరు మమ్మల్ని చూసుకోవాలని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లాఠీ బాసులకు అక్రమ ఆదాయం సమకూర్చుతున్నారు.

బార్లు..రెస్టారెంట్లు...స్పాలు...మసాజ్ సెంటర్స్ లో ...

సెటిల్ మెంట్స్, కలెక్షన్స్ నే టార్గెట్ గా హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి హవాను కొనసాగిస్తున్నారు. అధికారులు మారినా... వారి అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. జీతం కన్నా గీతమే ఎక్కువ సంపాదిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఒక స్పా యజమానిని బెదిరించి అరెస్టైన ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారం ఒక మచ్చు తునక మాత్రమే.. డిజిపి దృష్టికి వెళ్లడంతో ఇక చేసేది లేదని కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. రహస్యంగా ఇలాంటివి అనేకం కొనసాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది అక్రమాలపై... ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడినందునే ఈ పరిస్థితి నెలకొంది. కొన్ని పోలీస్‌ ఠాణాల్లో బెదిరింపులు.. సెటిల్‌మెంట్ల ద్వారా రూ.లక్షలు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.. వీరిలో 90 శాతం మంది ఎప్పుడూ పోలీస్‌ దుస్తులు ధరించరు. మఫ్టీలోనే ఉంటూ అధికారుల సొంతపనులు, వసూళ్ల వ్యవహారాలు చూస్తున్నారు. అందుకే ఠాణాల్లోకి వీరొస్తే ఎస్సైలైనా సరే.. కూర్చివేసి కూర్చోబెట్టాలి. వసూలు చేయడానికి వెళ్లితే డబ్బులు వినకపోతే..అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ రాత్రికిరాత్రి తీసుకువచ్చి తమ దైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తారు. అందుకే స్పెషల్ పార్టీలను రద్దు చేశారు. కొద్దిరోజులయ్యాక మళ్లీ అనధికారికంగా మొదలయ్యాయి. ఒక ఉన్నతాధికారి రెండు స్పెషల్‌ పార్టీలను ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. తాజాగా పట్టుబడిన కానిస్టేబుళ్లలో ఓ కానిస్టేబుల్‌ ఎనిమిదేళ్లుగా ‘స్పెషల్‌ పార్టీ’లో సభ్యుడిగా కొనసాగుతుండటం అశ్చర్యానికి గురిచేస్తుంది. అక్రమం, అన్యాయం చేస్తే కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా? అన్న ప్రశ్నలు ప్రతి పౌరుడిని నుంచి వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఈ స్పెషల్ పార్టీ దందాకు చరమగీతం పాడాల్సి ఉంది.

Similar News