రెండు వారాలు జాగ్రత్త.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక!
తొలి 15 రోజుల్లో భానుడి భగభగలు, వడగాలులు వీచే అవకాశాలు ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అటు హిమాలయ..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ లో తొలి 15 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు, వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప.. ఎండలో బయటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. తొలి 15 రోజుల్లో భానుడి భగభగలు, వడగాలులు వీచే అవకాశాలు ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అటు హిమాలయ పర్వతాల్లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్లు ఐఎండీ పేర్కొంది.
వాతావరణం ఇలా ఉన్న సమయంలో అడవుల్లో కార్చిచ్చు రేగే ప్రమాదం ఉందని, అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు మార్చి నుంచి ఎండలు మండిపోతుండగా.. శతాబ్దానికి మించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1901 తర్వాత ఈ మార్చిలో అంటే 122 ఏళ్ల తర్వాత దేశంలో మార్చి నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది.