తొమ్మిది నెలల్లోనే మూడు సార్లు వచ్చా...
‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మూడోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చాను. 9 నెలల్లోనే ప్రాజెక్టును గాడినపెట్టాం. సులభంగా పూర్తవ్వాల్సిన ప్రాజెక్టును నాశనం చేశారు. 2019లో మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020 ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్లం. పోలవరం ఏపీకి జీవనాడి. ఇది పూర్తైతే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 28.5 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖపట్నంలోని ప్రజలు, పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని అందించవచ్చు. ఈ ఏడాది 4 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ఈ నీళ్లలో కనీసం నాలుగైదు వందల టీఎంసీల నీళ్లు వినియోగించుకున్నా రాష్ట్రంలో కరువు అనేది లేకుండా చేయవచ్చు.’ అని చంద్రబాబు అన్నారు.
ప్రాజెక్టు పూర్తికి....
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేర్చారన్న చంద్రబాబు ఆ సమయంలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయని, దీని వల్ల ప్రాజెక్టు ముందుకు సాగదని కేంద్రానికి తెలిపి, ఆ ఏడు మండలాలు ఏపీలో కలపాలని అడగడం వల్ల పార్లమెంట్ సమావేశాలకంటే ముందుగానే కేబినెట్‌లో ఆమోదించి ఆర్డినెన్స్ ఇచ్చారని మరోసారి గుర్తు చేశఆరు. కేంద్ర ప్రాజెక్టులు పూర్తైన వాటి చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేదని, ప్రాజెక్టును పూర్తి చేయాలంటే రాష్ట్రమే శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని నీతి ఆయోగ్ చెప్పిందని చంద్రబాబు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో పనులు చేపట్టి 2019 నాటికి 73 శాతం పూర్తి చేశామన్న ఆయన ఒకేరోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డ్ సాధించామన్నారు. 414 రోజల్లో 1,397 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మించామని, నేరుగా 28 సార్లు సందర్శించా, 82 సార్లు వర్చువల్‌గా సమీక్ష చేశానని చంద్రబాబు తెలిపారు.
2026 ఫిబ్రవరి 26 నాటికి...
2019లో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో అంతా చూశారని, డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశారు. కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేసి ఉంటే డయాఫ్రం వాల్ దెబ్బతినేది కాదని, మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేయడానికి విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించాల్సి వచ్చిందని, కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని వారు సూచించారన్నారు. మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సి వచ్చిందన్న చంద్రబాబు అంతకు ముందు ఖర్చు పెట్టిన రూ.440 కోట్లు వృథా అయినట్లేనని ఆవేదన చెందారు. డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్న ఆయన ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1ను 2026 ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తామని తెలిపారు. ఎడమ కాలువ 2026 జూన్‌కు పూర్తవుతుందని, ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 మాత్రం 2027 డిసెంబర్‌కు గడువు పెట్టారని, టెక్నికల్ సమస్యలు ఉంటే తప్ప 2027 ఏప్రిల్ లేదా జూన్‌కు పూర్తి చేయాలని ఆదేశించానని చెప్పారు. ఫేజ్-1ఏ, ఫేజ్-2 1ఏ, 1బీ పూర్తికి భూ సేకరణ ఇంకా చేయాల్సి ఉందని, దాదాపు 26 పునరావాస కాలనీలు పూర్తయ్యాయని, మరో 49 పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు 14,329 మందిని పునరావాసాలకు తరలించామని, మరో 6,578 మందిని తరలించాల్సి ఉందని తెలిపారు. ఇవన్నీ పూర్తి చేయాలంటే మరో రూ.500 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు.
ప్రాజెక్టును తానే పూర్తి చేస్తున్నందుకు...
కొన్ని సమయాల్లో కొంతమందికి అద్భుత అవకాశాలు వస్తాయన్న చంద్రబాబు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర రూపురేఖలు మార్చాలని ఎంతో ప్రయత్నించానని చంద్రబాబు తెలిపారు. కానీ 2019లో అది సాకారం అయ్యే నాటికి పరిస్థితి మారిందని చంద్రబాబు అన్నారు. పరిశ్రమ పెట్టిన వ్యక్తి నష్టాలతో కూలిపోతే ఏ విధంగా బాధపడతారో నేను కూడా అలాగే బాధపడ్డానని, మళ్లీ భగవంతుడి ఆశీర్వాదంతో అవకాశం లభించిందని, కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కేంద్రం నుంచి అవసరమైన నిధులు వచ్చాయని, ప్రాజెక్టును తాను పూర్తి చేస్తున్నందుకు సంతోషం కలుగుతోందని, పోలవరం నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని పోలవరం-బనకచర్ల అనుసంధానం చేపట్టి పూర్తి చేస్తామని, . ఈ రెండూ చేయగలిగితే జీవితానికి పరమార్థం ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో తాను, తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.