రాజీనామా నేను చేయాలా?

అధికార వికేంద్రీకరణ అంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు

Update: 2022-10-10 06:59 GMT

అధికార వికేంద్రీకరణ అంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతిని రాజధానిగా భావిస్తున్నారన్నారు. మూడు రాజధానుల పెట్టే అధికారం లేదని ఆయన అన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని ఈ ముఖ్యమంత్రి చూస్తున్నాడన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే రాష్ట్రానికే ప్రమాదం వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఇంకా ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాము అధికారంలో ఉండగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. మీరు అభివృద్ధి చేయలేక డొంతిరుగుడుగా మూడు ముక్కలాటను ఆడుతున్నారన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే ఎందుకు కడుపు మంట అని ఆయన ప్రశ్నించారు. వారు పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా? ఉత్తరాంధ్ర మీ జాగీరా? అని ఆయన నిలదీశారు.

గతంలో వీరు ....
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి మూడేళ్లు ధర్మాన ప్రసాదరావు మూతికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాడన్నారు. వైసీపీ ట్రాప్ లో జనం పడి పోవద్దని అచ్చెన్నాయుడు అన్నారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాంలు పదవులు వచ్చేసరికి జగన్ భజన చేస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. గతంలో వారు జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. పదవుల కోసం రోజుకొక మాటలు మాట్లాడుతున్నారన్నారు. తనను రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, కానీ 2019 ఎన్నికల్లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తాను 2024 ఎన్నికల్లోనూ అమరావతి రాజధాని అని ప్రజల ముందుకు వెళతానిని తెలిపారు. రాజీనామాల డ్రామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.


Tags:    

Similar News