Andhra Pradesh : ఉగాది నుంచి మరో ప్రతిష్టాత్మకైన పథకం అమలు.. చంద్రబాబు సర్కార్ కసరత్తులు
ఉగాది నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది;

ఉగాది నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది. జీరో పావర్టీ పీ 4 పథకాన్ని అమలు చేయనుంది. ఉగాది రోజున చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కొంతకాలం నుంచి అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారు. మార్చి 30న జరిగే ప్రారంభోత్సవ సమావేశంపై ప్రధానంగా అధికారులతో చర్చించారు కూడా. మహిళలు, గ్రామీణ ప్రజలను పీ4లో ప్రధాన భాగస్వాముల్ని చేయాలని... దీని అమలులో పారదర్శకత, విధాన రూపకల్పన అవసరమని చంద్రబాబు గట్టిగా నిర్ణయంచారు. ఈ మేరకు అధికార వర్గాలను సిద్దం చేశారు.
ప్రజాభిప్రాయం తీసుకుని...
పీ4 విధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ప్రజల నుంచి అభిప్రాయాల్ని తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సూచించారు. దీర్ఘకాలిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పీ4 సొసైటీని ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా చేయాలని చంద్రబాబు నాయుడు, ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచించారు. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. మరింత మంది పీ4 విధానాన్ని అర్థం చేసుకుని ప్రయోజనం పొందేలా సన్నాహాలు జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి అన్నారు.
ఆర్ధిక అసమానతలు తగ్గించాలనే...
స్వర్ణాంధ్ర -2047 విజన్ పది సూత్రాల అమలులో భాగంగా ‘జీరో పావర్టీ-పీ4’ను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ప్రజల ఆర్థిక వృద్ధికి చురుకుగా దోహదపడేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడటమే పీ4 ప్రధాన లక్ష్యం. ఆర్థికంగా సంపన్నులైన కుటుంబాలు... పేదరికంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించడంతో పాటు వారి ఆర్ధిక ఎదుగుదలకు మద్దతుగా నిలిచేలా చేస్తాయి. పీ4 అమలు ద్వారా సామాజిక-ఆర్థిక అంతరాలను తగ్గించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఉగాది రోజు నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని, దీనిని తాను అనుకున్న స్థాయిలో సక్సెస్ చేయాలని అధికారులను చంద్రబాబు ఇప్పటికే క్లాస్ పీకారు. దీంతో అధికారులందరూ ఈ కార్యక్రమం అమలుపై ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు.