Ap Elections : వెయిటింగ్ మహా బోరు బాసూ... పోలింగ్ .. కౌంటింగ్‌కు ఇరవై రోజులు ఉగ్గబట్టి ఫలితం కోసం?
Ap Elections : పోలింగ్ .. కౌంటింగ్‌కు ఇరవై రోజులు ఉగ్గబట్టి ఫలితం కోసం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుంది. అంటే కౌంటింగ్ పూర్తయిన దాదాపు ఇరవై రోజుల పాటు ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏడు దశల్లో ఏపీ, తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ప్రజలు తమ ఓటు హక్కును మే 13వ తేదీన వినియోగించుకుంటారు. అయితే ఫలితాలు మాత్రం జూన్ నాలుగో తేదీ వరకూ తెలియదు.
ఇరవై రోజుల పాటు...
అభ్యర్థులు దాదాపు ఇరవై రోజుల పాటు ఫలితం కోసం ఉగ్గబట్టి ఎదురు చూడాల్సిందే. ఇరవై రోజుల పాటు తమ క్యాడర్ ను కాపాడుకోవాల్సిందే. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు ముఖ్యమైన నేతలు, అనుచరులను కూడా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు బాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నుంచే ఖర్చు మొదలవుతుంది. అంటే దాదాపు రెండు నెలల పాటు క్యాడర్ ను పోషించుకోవాల్సి వస్తుంది. ఇది అభ్యర్థులకు మరింత భారంగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
నేటి నుంచే...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికే వారు ప్రచారంలోకి వెళ్లారు. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా నేటి నుంచే అభ్యర్థులందరూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు క్యాడర్ ను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది తలకు మించిన భారంగా మారనుంది. మొత్తం మీద ప్రచారాన్ని దాదాపు రెండు నెలల పాటు నిర్వహించాల్సి రావడం, పోలింగ్ అయిన తర్వాత ఇరవై రోజులు వెయిటింగ్ అంటే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతుందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.