Chandrababu : చంద్రబాబు ప్రయత్నాలన్నీ వృధాయేనా? అటు వైపు చూసేది వారు మాత్రమేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు.

Update: 2024-07-07 05:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు తెలంగాణ పార్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంపై సొంత పార్టీలోనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ఎవరు విశ్వసిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు పెద్దగా లేదు. 2014, 2018 ఎన్నికల్లో కొంత కనిపించినా మొన్నటి ఎన్నికలకు పూర్తిగా దూరం కావడంతో నేతలతో పాటు క్యాడర్ కూడా ఇతర పార్టీల వైపు మళ్లింది.

పోటీకి దూరంగా ఉండటంతో...
2014, 2018 ఎన్నికల్లో కొన్ని స్థానాలనయినా టీడీపీ గెలుచుకుంది. 2018లో ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాలకు మాత్రమే అది పరిమితమయింది. ఇక ఏ జిల్లాలోనూ టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక 2023 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఓటమి పాలు కావడంతో ఇక తెలంగాణలో పార్టీని నడపలేమని భావించి గత ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ సయితం పోటీ చేయడం లేదని తెలిసి బీఆర్ఎస్ లో చేరిపోయారు.
క్యాడర్ ఎక్కడ?
ఇప్పుడు మళ్లీ ఏపీలో అధికారంలోకి రావడంతో పార్టీ ఎంత మేర బలపడుతుంది అన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఎవరో ఒక నేత అధ్యక్షుడిగా అయితే వస్తారు. కానీ ఉత్సవ విగ్రహమే. అంతే తప్పించి రాష్ట్ర స్థాయిలో ప్రభావం చేయగల నేత ఎవరూ రాకపోవచ్చు. దీనికి కారణం కూడా లేకపోలేదు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పై ఉన్న శ్రద్ధ, తెలంగాణ పార్టీపై ఉండదు. ఎందుకంటే ఆయనకు ఏపీ పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. అది అందరికీ తెలిసిందే. కాకుంటే తెలంగాణ పార్టీని జాతీయ స్థాయిలో తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకునేందుకు మాత్రమే వస్తారని కూడా తెలుసు. అంత తెలియని పిచ్చోళ్లు కాదు క్యాడర్. అందుకే నేతలు ఎవరు పార్టీ పదవుల కోసం, లేకుంటే మరేదైనా పదవులను ఆశించి వచ్చినా వారికి సహకరించేందుకు క్యాడర్ మాత్రం ఉండదు.
జాతీయ పార్టీగా...
ఇది ఒక్క టీడీపీకి మాత్రమే కాదు. వైసీపీకి కూడా ఇదే పరిస్థితి. వైఎస్సార్టీపీ పెట్టి వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందే జెండా పీకేయగా, వైసీపీ అధినేత జగన్ తెలంగాణలో వైసీపీ పార్టీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన చేయలేదు. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇంకా టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని ఆయన నమ్మకంతో ఉన్నారు. నగరంలో టీడీపీకి అభిమానులు, తనంటే ప్రేమించేవారున్నారని భావిస్తున్నారు. దీంతో పాటు జాతీయ పార్టీగా తాము చెప్పుకోవాలంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లుంది. ఈరోజు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. అయితే తెలంగాణలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటు బ్యాంకు మళ్లీ సైకిల్ వైపు మళ్లుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఇక్కడ అధికారంలోకి రాదు. గెలిపించినా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరన్న ఒకే ఒక కారణం ఆ పార్టీ ఇక్కడ పుంజుకునే అవకాశాలు లేవన్నది సుస్పష్టం.


Tags:    

Similar News