Chandrababu : గుడ్ న్యూస్ సంక్రాంతికి ఏపీ ప్రజలకి మంచి రోజులు వచ్చినట్లే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టడం లేదు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టడం లేదు. సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో జరపాలన్న నిర్ణయానికి వచ్చారు. నిధులు పెద్దగా అందుబాటులో లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా వ్యవహరించడం, మద్దతుగా నిలుస్తుండం చంద్రబాబు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా చూడాలి. రుణాల విషయంలోనూ, నిధుల మంజూరులోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎక్కువగా రాష్ట్రానికి విడుదల చేయడంలోనూ ఢిల్లీ పెద్దలసు సహకరిస్తుండటంతో చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు.
కొన్ని పథకాలను ప్రారంభించి…
ఇప్పటికే నాలుగు వేల రూపాయలు నెలకు పింఛను ఇస్తున్నారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయల పింఛను నెలకు అందిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా మరో ఆదేశం కూడా జారీ చేశారు. ఎవరైనా పింఛను తీసుకుంటూ ఆ ఇంట్లో పెద్ద మరణిస్తే వెంటనే వితంతు పింఛనును మంజూరు చేయాలని, ఆ నెలలో పింఛను మొత్తం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది పేదకుటుంబాలలో పెద్దలను కోల్పోయిన వారికి ఎంతో ఊరట కల్గించే అంశంగానే చూడాలి. దీంతో పాటు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినచంద్రబాబు వచ్చే నెలలో దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే నెలలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తారని తెలిసింది.
రైతులకు పెట్టుడి సాయంకూడా…
ఇక రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా జనవరి నెలలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ రైతులకు పెట్టుబడి సాయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వలేదు. ఎన్నికల్లో ఇచ్చినహామీల అమలులో భాగంగా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు నాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంత ఖర్చవుతుంది? ఎంత నిధులు కావాలి? అన్న దానిపై అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది.సంక్రాంతి నాటికి రైతుల పండగ రోజు ఈ పథకాన్నిఅమలు చేసే విధంగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలియవచ్చింది. పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగిలిన నిధులను జమచేసి రైతుల ఖాతాల్లో జమచేయనుంది.
తల్లికి వందనం కూడా…
ఇక మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. దీనిని కూడా జనవరి నెలలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. మార్చి నెలతో విద్యాసంవత్సరం పూర్తవుతుంది. తిరిగి జూన్ నెల నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లికి వందనం కింద ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా రూపొందించాలని, ఎంత మొత్తం ఖర్చవుతుందన్న వివరాలను తనకు అందివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద సంక్రాంతి నాటికి దాదాపు చాలా వరకూ ముఖ్యమైన పథకాలను అమలు చేసేందుకు అవసరమైన తేదీలను చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయి.