Union Cabinet : ఏపీకి భారీగా కేంద్ర మంత్రి పదవులు.. ఎప్పుడూ లేనంతగా.. తెలంగాణను మించి దక్కే అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ లేనన్ని మంత్రి పదవులు కేంద్రంలో దక్కే అవకాశాలున్నాయి.

Update: 2024-06-09 04:37 GMT

ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ లేనన్ని మంత్రి పదవులు కేంద్రంలో దక్కే అవకాశాలున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేని రాజకీయ పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. మోదీ సర్కార్ ఏపీలో ఉన్న టీడీపీ, జనసేనలపై ఆధారపడి మనుగడ సాధించాల్సి రావడంతో గతంలో లేని పదవులు ఇప్పుడు వాటికవే తన్నుకుంటూ వస్తాయన్న అంచనాలు వినపడుతున్నాయి. కేంద్ర కేబినెట్ లో తీసుకోవడం ప్రధాని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయినా సరే.. పార్టీని బలోపేతం చేయాలనుకున్నా, మిత్ర పక్షాలకు సీట్లు కేటాయించాలన్నా హస్తిన లో ఉన్న వారి దయాదాక్షిణ్యాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణాదిన ఉండటంతో గత పదేళ్లు.. అంతకు ముందు కూడా పెద్దగా కేంద్ర కేబినెట్ లో పదవులు దక్కేవి కావు.

అప్పుడూ అంతే...
కాంగ్రెస్ అధికారంలో ఉండగా అది తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఆంధ్రప్రదేశ్ కు పెద్దగా పదవులు లభించేవి కావు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రెండు మంత్రి పదవులు వచ్చాయి. నాడు బీజేపీ, టీడీపీ కూటమిగా ఉండటంతో కేవలం రెండు పదవులు మాత్రమే టీడీపీ వారికి దక్కాయి. అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరికి మాత్రమే కేంద్ర పదవులు లభించాయి. అప్పుడు బీజేపీకి సొంతంగా బలం ఏర్పడటంతో డిమాండ్ చేసే అవకాశం లేదు. వాళ్లు ఇచ్చింది మనం పుచ్చుకోవడమే. అదే 2014లో జరిగింది. అందుకే కేంద్రంలో అనుకున్న స్థాయిలో పదవులు దక్కలేదు.
గత ఎన్నికల్లో...
2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేసింది. ఒక్క స్థానమూ బీజేపీకి దక్కలేదు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులున్నా వారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదు. పొరుగున ఉన్న తెలంగాణకు మాత్రం కేంద్ర కేబినెట్ లో స్థానం లభించింది. ఏపీలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలేనట్లు కేంద్ర నాయకత్వం వ్యవహరించింది.అప్పుడు కూడా సొంతంగా బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. గవర్నర్ పోస్టులయితే ఇచ్చారు కానీ కేంద్ర మంత్రి పదవులు మాత్రం ఇవ్వలేకపోయారు. నిర్మాలా సీతారామన్ ఏపీకి చెందిన నేతను వివాహమాడినా ఆమె ఇక్కడ నుంచి రాజ్యసభకు ఎంపిక కాలేదు. దీంతో 2019 నుంచి 2024 వరకూ ఏపీలో ఒక్కకేంద్ర మంత్రి కూడా లేరు. కనీసం రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇవ్వాలన్న ఆలోచనకూడా బీజేపీ పెద్దలు చేయలేదు.
ఇప్పడు అలా కాదు...
అయితే ఇప్పడు అలాకాదు.. అంతా సజావుగా జరిగితే ఆరు మంత్రి పదవులు ఏపీకి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. బీజేపీ నుంచి ఒకటి, జనసేన నుంచి ఒకటి, టీడీపీ నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారింది. భాగస్వామ్య పార్టీల్లో అతి పెద్ద పార్టీగా టీడీపీ నిలిచింది. అందుకే నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా ఒక మంత్రి పదవి జనసేన దక్కించుకునే వీలుంది. ఎటూ బీజేపీ నుంచి ముగ్గురు గెలవడంతో ఒకరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈసారి పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఎక్కువ సంఖ్యలో పదవులు లభిస్తాయని అంటున్నారు. ఈరోజు మాత్రం టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లు మాత్రమే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్కీకారం చేయనున్నారు. తర్వాత విస్తరణలో మరో రెండు పదవులు టీడీపీకి లభించనున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి.


Tags:    

Similar News