వివాదంలో ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ వివాదంలో చిక్కుకున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ వీడియో బయటకు వచ్చింది. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీపై ఆమె కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఒక గ్రామంలో ఇరవై మంది ఓట్లు ఉంటే ఇరవై వేలు ఇవ్వండని, ఆ డబ్బు ఓటర్లకు చేరిందో లేదో? ఫోన్ చేసి క్రాస్ చేసుకోవాలంటూ నేతలకు సూచించడం అందులో కనిపిస్తుంది.
ఓటర్లకు డబ్బులు...
కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని పంచాయతీల వారీగా ఓటర్ల లిస్టు పరిశీలన చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీకి సిద్ధమవుతుండటం దుర్మార్గమని అన్నారు. ఓటర్లకు క్షమాపణ చెప్పాలని, జగన్ ఉషశ్రీ చరణ్ ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఆయన కోరారు.