TDP : మరో సర్వే రిలీజ్... తెలుగు తమ్ముళ్ల జోష్ మామూలుగా లేదుగా

ఏపీ ‌లో మరో సర్వే సంచలనం రేపుతుంది. ఈ సర్వేలో మాత్రం టీడీపీ, జనసేన కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

Update: 2024-02-08 11:01 GMT

ఆంధ్రప్రదేశ్ ‌లో మరో సర్వే సంచలనం రేపుతుంది. అయితే ఈ సర్వేలో మాత్రం టీడీపీ, జనసేన కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్‌తక్, సీఓటరు నిర్వహించిన ఈ సర్వేలో అత్యధిక స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఏపీ ఎన్నికలకు ముందు వస్తున్న సర్వేలు ఆసక్తిని రేపుతున్నాయి. జాతీయ మీడియా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తుండటంతో సర్వేల పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి.

25 పార్లమెంటు స్థానాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంటు స్థానలపైనే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. సర్వే ఫలితాను వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ సంస్థ వైసీీపీకి 19 పార్లమెంటు స్థానాలు, టీడీపీ, జనసేన కూటమికి ఆరు స్థానాలు వస్తాయని చెబితే ఆజ్‌తక్, సీ ఓటరు సర్వే మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ సర్వేలో టీడీపీకి పదిహేడు పార్లమెంటు స్థానాలు వస్తాయని తేల్చింది. అలాగే వైసీపీకి ఎనిమిది స్థానాలు మాత్రమే దక్కుతాయని పేర్కొంది.
వరస సర్వేలతో...
ఇలా వరస సర్వేలతో ఏపీ ప్రజలు కొంత కన్ఫ్యూజన్ కు గురవుతున్నప్పటికీ పేరున్న మీడియా సంస్థలు చేసి వెల్లడిస్తున్న సర్వే ఫలితాలు కావడంతో దేనిని నమ్మాలో? దేనిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు సమయం ఉందని, ఈ రెండు నెలల్లో ఓటరు మనసు మారే అవకాశముందని, ముందస్తు సర్వేల కంటే పోలింగ్ రోజున నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ను మాత్రమే తాము నమ్ముతామని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద ఆజ్ తక్ సర్వే ఫలితాలతో తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరిగింది.

ఓట్లు శాతం ఇలా...

తెలుగుదేశం పార్టీ ఓటు షేరింగ్ శాతాన్ని కూడా పెంచుకుంది. 2019 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ సంపాదించుకున్న టీడీపీ, ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 45 శాతం ఓటు షేర్ సాధిస్తుందని ఈ సర్వేలో తేలింది. వైసీపీ గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లు రాగా ఈసారి మాత్రం 41 శాతానికే పరిమితమవుతుందని సర్వేలో వెల్లడయింది. ఎన్డీఏ కు రెండు శాతం, ఇండియా కూటమికి మూడు శాతం, ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. 


Tags:    

Similar News