బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ

అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన దాడులలో పలువురు గాయపడ్డారు

Update: 2023-08-04 16:25 GMT

అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన దాడులలో పలువురు గాయపడ్డారు. ఇరు పార్టీలకు చెందిన వాళ్లు ఆసుపత్రి పాలయ్యారు. మొదట టీడీపీ నాయకులే రెచ్చగొట్టారని వైసీపీ నేతలు అంటూ ఉండగా.. వైసీపీ నేతలే తమ మీద రాళ్ల దాడులకు తెగబడ్డారంటూ టీడీపీ వర్గం చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. శనివారం.. ఆగస్టు 5న చిత్తూరు జిల్లా బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలు తగలబడ్డాయి. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డాని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతూ అ‍గ్నికి మరింత ఆజ్యం పోశారని.. పోలీసులపై అసభ్యకర పదజాలం వాడుతూ దూషించారని అంటున్నారు. ఈ దాడిలో ఇరు పార్టీల కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి మాట్లాడుతూ పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారన్నారు. చంద్రబాబు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉండగా.. రూట్‌ మార్చి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. పుంగనూరులోకి రాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నామని.. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారన్నారు.


Tags:    

Similar News