Andhra Pradesh : అందుకే అయ్యన్నకు అంత ప్రయారిటీ.. చంద్రబాబు సెలక్షన్ మామూలుగా లేదుగా?

చింతకాయల అయన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీకి స్పీకర్ అయ్యారు. ఆయన పదవీ బాధ్యతలను చేపడతారని ముందు నుంచే ప్రచారం జరిగింది

Update: 2024-06-22 12:19 GMT

చింతకాయల అయన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీకి స్పీకర్ అయ్యారు. ఆయన పదవీ బాధ్యతలను చేపడతారని ముందు నుంచే ప్రచారం జరిగింది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విశాఖపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఖచ్చితంగా చంద్రబాబు కేబినెట్ లో ఉంటారు. ముఖ్యమైన శాఖలను ఆయనకు ఇస్తారు. ఈసారి కేబినెట్ ఏర్పాటు జరిగినప్పుుడు అయ్యన్నపాత్రుడు పేరు కేబినెట్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందులో విశాఖ లాంటి ప్రాంతం నుంచి వంగలపూడి అనిత ఒక్కరినే మంత్రివర్గంలోకి ఎంపిక చేయడంపైన కూడా టీడీపీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

మనసులో ఉన్నది...
సహజంగా అయ్యన్నపాత్రుడు కొంత దూకుడుతో ఉంటారు. ఆయన మాట నోటి నుంచి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటుంది. ఆయన తన మనసులో ఉన్న దేనినీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు చెప్పేయడమే. సొంత పార్టీ నేతలపైనే ఆయన మంత్రిగా ఉండి ధ్వజమెత్తారు. మంత్రిగా ఉండి అధికార పార్టీలో ఉన్న మరొకమంత్రిపై ఆయన గతంలో ఆరోపణలు కూడా చేశారు. విశాఖలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ సంచలనమే అయ్యాయి. అయితే ఆయన కేవలం శత్రుత్వంతోనే మాట్లాడరు. వాస్తవాన్ని అధినాయకత్వం ముందు ఉంచడం కోసమే ఆయన ఆరోజు అలా మాట్లాడారు. అయితే అయ్యన్న మాటలను తేలిగ్గా తీసుకోని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ భూ కుంభకోణంపై సిట్ ను ఏర్పాటు కూడా చేశారు.
అనే కేసులు...
ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పాల్సిన పనిలేదు. పార్టీ తరుపున తన వాయిస్ ను వినిపిస్తూనే ఉన్నారు. 65 ఏళ్ల వయసులోనూ ఇతర నేతలకు భిన్నంగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేసింది అయ్యన్న మాత్రమే. మిగిలిన వాళ్లు పదవిలో ఉన్నా పెదవి విప్పకపోయినా అయ్యన్న మాత్రం తన స్టయిల్ లో ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అలాంటి అయ్యన్న పాత్రుడు గత ప్రభుత్వ హయాంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఆయనపై 23 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యాచారం కేసు కూడా ఉంది. ఆయన విశాఖలో ఉండి కూడా తమకు రాజధాని అవసరం లేదని చెప్పిన నేతగా తెలుగుదేశం పార్టీ అధినేతకు అండగా నిలిచారు.
జెండా దించకుండా...
అతి చిన్న వయసులో ఆయన మంత్రి అయ్యారు. కేవలం 25 ఏళ్లవయసులోనే మంత్రి అయ్యారు. టీడీపీకి నమ్మకమైన కుటుంబం. ఎన్ని కష్టాలొచ్చినా పార్టీ మార్చలేదు. జెండాదించలేదు. అలాంటి అయ్యన్నకు మంత్రి పదవిదక్కక పోవడం ఏంటని అందరూ బుగ్గలు నొక్కుకున్న వారు పార్టీలోనే ఎందరో ఉన్నారు. కానీ చంద్రబాబు మనసులో అత్యున్నతమైన స్పీకర్ పదవి ఇవ్వాలని ఉందని తెలియని వారు అలా అనుకున్నారు. ఈరోజు అయ్యన్నపాత్రుడు శాసనసభ కు స్పీకర్ అయ్యారు. అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అయన్న కష్టాన్ని చూసి చంద్రబాబు ఇచ్చిన అరుదైన గిఫ్ట్‌ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు తెగ మెచ్చేసుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు కూడా శాసనసభను నిబంధనలకు అనుగుణంగా నడిపి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అనుచరులు, సన్నిహితులు ఆశిస్తున్నారు.


Tags:    

Similar News