YCP : పవన్ ను ఎర్రగడ్డలో చూపించాల్సిందే.. తప్పేట్లు లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజారాజ్యం నుంచి చూస్తున్నామని, పవన్ కల్యాణ్ మాటలు అలాగే ఉంటాయని, చేతలు మాత్రం ఉండవని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్‌కు, చిరంజీవికి అసలు పోలికే లేదని తెలిపారు. పవన్ కల్యాణ్ భాష ఎలా ఉంటుందో అందరికీ తెలుసునన్న గ్రంధి శ్రీనివాస్ పవన్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించగలిగితే తనకున్న తొమ్మిది ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. భీమవరం వచ్చి అడిగితే పవన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందని అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత...
పవన్ నిజస్వరూపం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే అందరికీ తెలిసిందన్న గ్రంధి అప్పటి వరకూ ఆయనను హీరోగా భావించిన అభిమానులు అసలు విషయం తెలుసుకుని జారుకున్నారన్నారు. విపరీతంగా ప్రేమించే అభిమానులను కూడా పవన్ పట్టించుకోరన్న విషయం అందరూ గుర్తించారన్నారు. సొంత అన్నయ్యతో విభేదించానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి పద్దెనిమిది అసెంబ్లీ సీట్లను గెలిచారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన కామెంట్స్ చూస్తుంటే పవన్ కల్యాణ్ కు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలన్న అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబుతో కుమ్మక్కై ప్యాకేజీకి ఒప్పుకుని సీట్లను తగ్గించుకోవడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే మండిపడుతున్నారన్నారు.