Andhra Pradesh : చిన్నమ్మకు ఛాన్స్ లేనట్లేనా... ఈసారి ఆర్ఎస్ఎస్ ప్రభావం పనిచేసిందా?
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు సాయంత్రం నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు సాయంత్రం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి దక్కుతుందన్న దానిపై అంచనాలు మాత్రం కొంత రివర్స్ అయ్యాయి. ఈసారి మంత్రి వర్గం కూర్పులో బీజేపీ మిత్రపక్షాలను పక్కన పెడితే ఎక్కువ మందికి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న నేతలకే అవకాశం దక్కనున్నట్లు తెలిసింది.
ఆర్ఎస్ఎస్ మూలాలు...
తెలంగాణలో కేంద్ర మంత్రులుగా జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఇద్దరికీ చోటు దక్కింది. ఇద్దరూ ఈరోజు ప్రధాని నివాసానికి తేనేటి విందుకు హాజరవ్వడంతో వీరిద్దరికీ మంత్రి పదవులు ఖాయమయ్యాయి. ఇద్దరూ బలమైన నేతలు. బీజేపీకి తొలి నుంచి అంటిపెట్టుకున్న నేతలుగా పేరుపొందారు. వారికి కాషాయ జెండా తప్ప మరొక జెండా తెలియదు. తెలంగాణలో బీసీ కోటాలో ఈటల రాజేందర్, మహిళకోటాలో డీకే అరుణ పేర్లు వినిపించినా వాళ్లిద్దరూ ఇతర పార్టీల నుంచివచ్చిన వాళ్లు కావడంతో వారిని పక్కన పెట్టినట్లు తెలిసింది.
అదే ఫార్ములా...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ అదే ఫార్ములాను బీజేపీ నాయకత్వం అనుసరించిందన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంద్రీశ్వరికి చోటు కల్పించాలని భావించారు. కానీ పురంద్రీశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత కూడా కావడంతో ఆమె పేరు చివరి నిమిషంలో మారినట్లు తెలిసింది. ఆ స్థానంలో నరసాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరు ఖరారయినట్లు సమాచారం. ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు కూడా ఉండటంతో అదనపు బలం అని చెబుతున్నారు. శ్రీనివాసవర్మ కూడా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారన్న ప్రచారం మాత్రం హస్తినలో జరుగుతుంది. మరి ఈరోజు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.