Tirumala laddu Controversy : కేసుపై ఏఆర్ డెయిరీ ఏం చేయబోతుంది? రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే?
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీపై టీటీడీ ఫిర్యాదుతో తిరుపతి పోలస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీపై టీటీడీ ఫిర్యాదుతో తిరుపతి పోలస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అయితే ఏఆర్ డెయిరీ మాత్రం తాము నెయ్యిలో కల్తీ కలపలేదని చెబుతుంది. తమ డెయిరీ పై తమిళనాడు ప్రభుత్వం కూడా దాడులు నిర్వహించిందని, ఇవే రకమైన ఆరోపణలు పళనిస్వామి ఆలయంపై కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ దాడులు చేసిందని ఏఆర్ డెయిరీ చెబుతుంది. అయితే ప్రభుత్వం జరిపిన దాడుల్లో తాము ఎలాంటి కల్తీ జరపడం లేదని నిర్ధారణ అయిందని ఏఆర్ డెయిరీ వివరణ ఇస్తుంది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కూడా ఏఆర్ డెయిరీ ఆవు నెయ్యిని సరఫరా చేస్తుంది.
తమిళనాడు ప్రభుత్వ దాడుల్లోనూ...
పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రసాదంలో కూడా నాణ్యత లేదని పలు పోస్టింగ్ లు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తిరుమల లడ్డూ వివాదం కూడా తోడవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం ఏఆర్ డెయిరీపై దాడులు నిర్వహించగా అన్ని సక్రమంగానే ఉన్నట్లు తేలిందని ఆ డెయిరీ చెబుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి ఈ ఏడాది మే 15వ తేదీన పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఆర్డర్ ఇవ్వగా, అందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని జూన్ 12, 20, 22, జులై 6వ తేదన ఏఆర్ డెయిరీ తిరుమలకు పంపిందని చెబుతుంది. అయితే అప్పుడు అడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండానే గతంలో ఉన్న పాత విధానాల ప్రకారం పరీక్షలను నిర్వహించి నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించిందని చెబుతుంది.
టీటీడీ ఫిర్యాదులో మాత్రం...
అయితే ఎన్‌డీబీఎల్ ల్యాబ్‌లో పరీక్షలు చేయగా అందులో జంతువుల నూనె కలసిందని తేలిందని, ఈ మేరకు నివేదికలు కూడా వచ్చాయని టీటీడీ అధికారి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఏఆర్ డెయిరీ మాత్రం తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని, తాము నెయ్యి సరఫరా చేసే ముందు నేషనల్ డెయిరీ డెవలెప్‌మెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకుని టీటీడీకి ఇచ్చామని చెబుతుంది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఏఆర్ డెయిరీ సంస్థ తెలపడంతో ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం న్యాయస్థానానికి చేరే అవకాశముంది. ఇప్పటికే తాము ఎలాంటి కల్తీ చేయలేదని సెప్టంబరు 4వ తేదీన టీటీడీకి తాము వివరణ ఇచ్చామని, అయినా కూడా కేసు పెట్టారంటూ ఏఆర్ డెయిరీ చెబుతుంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.