ఉదయ్ రిమాండ్ రిపోర్టులో ఇలా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లిడించింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లిడించింది. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌కుమార్ రెడ్డి ప్రయత్నించడాని చెప్పింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌కుమార్ రెడ్డి తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్‌రెడ్డి ఉన్నారని పేర్కొంది. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేసేందుకు వారిద్దరూ అవినాష్ ఇంట్లోనే ఎదురుచూశారని తెలిపింది.
సాక్ష్యాలను చెరిపేసేందుకు...
ఎంపీ అవినాష్ రెడ్డికి శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారని, హత్య జరిగిన స్థలంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయని సీబీఐ ఉదయ్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆ రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా గుర్తించామని తెలిపిన సీబీఐ వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించామన్నారు. విచారణకు ఉదయ్ సహకరించడం లేదని, పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశామని సీీబీఐ తెలిపింది.