Chandrababu : చంద్రబాబు ఆలోచన అదేనా? అప్పుడే జనం మొగ్గుచూపుతారా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు పదుల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒకరు వ్యూహాలను నేర్పాల్సిన పనిలేదు.;

Update: 2024-08-07 08:10 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు పదుల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒకరు వ్యూహాలను నేర్పాల్సిన పనిలేదు. ఆయనకు స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. ఎప్పుడు ఏది చేయాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంత మరే నేతకు తెలియదు. అందులో నూటికి నూరుపాళ్లు వాస్తవం ఉంది. చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళతారు. ఎప్పుడూ ఆయన బిజీగానే ఉంటారు. కేవలం కార్యాలయానికే పరిమితం కారు. జనం మధ్యకు అధికారంలో ఉన్నా, లేకున్నా వెళ్లడం ఆయనకు అలవాటు. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనను ఇబ్బంది తెచ్చి పెడుతుంది.

కేంద్ర ప్రభుత్వాన్ని....
కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరలేని పరిస్థిితి. నిధులు ఇవ్వమని ఢిల్లీ చుట్టూ తిరగలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయదన్న సంగతి ఆయనకు తెలియంది కాదు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటివి చంద్రబాబుకు ప్రధమ ప్రాధాన్యాలు. ఖజానా చూస్తే బోసిపోయికనిపిస్తుంది. ఎటూ చేయలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగువేల రూపాయల పింఛను అయితే ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించి వారిలో సానుకూలత సంపాదించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఈ రెండు ముఖ్యమైన అంశాలుగా ఆయన తీసుకున్నారు.
అమలు చేయాలంటే...?
ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ఖజానా వెక్కిరిస్తుంది. దీంతో తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు, యాభై ఏళ్లు దాటిన బీసీలకు పింఛను ఇస్తామనడం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం, రైతు భరోసా, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావనలో ఉన్నట్లు కనపడుతుంది. లేదంటే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
సంపద సృష్టిపైనే...
చంద్రబాబు ఆలోచన తీరుకు అది విరుద్ధం. అప్పులు చేసి అభివృద్ధి చేయాలనుకుంటారు కానీ, సంక్షేమ పథకాలను అమలు చేసి చేతులు కాల్చుకునే పని చేయరు. ఎందుకంటే అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు కొంత సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి సంక్షేమ పథకాలను అమలు చేసినా ఆయన గెలిచింది లేదు. అందుకే .. ఈ పథకాలను, తాను ఇచ్చిన హామీలను ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు వరసగా అమలు చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారని, అది మరోసారి కూటమి విజయానికి దోహదపడుతుందని ఆయన అంచనాలో ఉన్నట్లుంది. మరి చంద్రబాబు ఆలోచన నిజమైతే ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు ఏపీలో అమలయ్యేది కష్టమేనంటున్నాయి అధికార వర్గాలు.


Tags:    

Similar News