Chandrababu : తిరుమలలో వారికి స్ట్రయిట్ గా వార్నింగ్ పంపిన చంద్రబాబు

పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

Update: 2024-06-13 05:06 GMT

పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కుటుంబ వ్యవస్థ కలకాలం ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ప్రజలు విజయాన్ని అందించాలన్నారు. పేదరికం లేని సమాజం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకుని తాను ముందుకు వెళ్లానని చెప్పారు. ఆర్థిక అసమానతలు సమాజంలో తొలిగిపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు.

తప్పించుకునేందుకు వీలులేదు...
ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో అవినీతి జరిగిందని, తిరుమలలో హిందూ ధర్మాన్ని రక్షించడం అవసరమని తెలిపారు. తన మీద ప్రజలు నిలబెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని, తప్పులు చేస్తే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. తాను అందరి వాడినని, ఐదుకోట్ల మంది తనను ఆశీరవ్రదించారని తెలిపారు. తాను కుటుంబానికి ఒక్క పైసా ఇవ్వాల్సిన పనిలేదన్న చంద్రబాబు తన జీవితం ప్రజలకే అంకితం అని చెప్పారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.


Tags:    

Similar News