1.23 లక్షల లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు అందజేసిన సీఎం జగన్
16 నెలల క్రితమే లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే పథకానికి బాటలు వేశామని, ఇప్పుడు పేదల కల సాకారమయ్యేలా ఇళ్ల పట్టాలు..
విశాఖపట్నం : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 1.23 లక్షల లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం నుంచి జగన్ ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 300 ఎకరాల్లో పేదలకు 10 వేల 228 ప్లాట్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. కాలనీలో ఇళ్లతో పాటు స్కూళ్లు, విలేజ్ క్లినిక్ లు, అంగన్ వాడీ సెంటర్లు వంటి వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మార్కెట్ యార్డు, సచివాలయ నిర్మాణం జరుగుతుందన్నారు.
16 నెలల క్రితమే లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే పథకానికి బాటలు వేశామని, ఇప్పుడు పేదల కల సాకారమయ్యేలా ఇళ్ల పట్టాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ కు ఎక్కడ మంచి పేరొస్తుందోనని.. జగన్ కు ప్రజలు ఎక్కడ మద్దతిస్తారోనని కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని పరోక్షంగా చంద్రబాబుపై మండిపడ్డారు సీఎం జగన్. ఇళ్లస్థలాలను పంపిణీ చేయకుండా కోర్టు కేసులు వేశారని, ఆ కోర్టు కేసులు ఎప్పుడెప్పుడు పోతాయా? అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు మంచి చేద్దామా? అని 489 రోజులు వేచి చూశానన్నారు. దేవుడి దయతో ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని జగన్ చెప్పుకొచ్చారు.
అందరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న జగన్.. ప్రజలకు తాము మంచి చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని, కానీ, తమ ప్రభుత్వం మాత్రం 30.7 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని జగన్ చెప్పారు. అలాగే రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలను నిర్మించనున్నట్లు జగన్ తెలిపారు. ఇల్లులేని పేదలకు జగన్ శుభవార్త చెప్పారు. సొంతిల్లు లేదని ఎవరూ బాధపడొద్దని, సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే.. అర్హత ఉన్నవారందరికీ రెండు నెలల్లో ఇల్లు మంజూరు చేస్తామన్నారు.