ఆ మూడు నియోజకవర్గాలపై సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌.. పంతం నెగ్గించుకుంటారా?

వచ్చే ఎన్నికల్లో మొత్తానికి మొత్తం అంటే 175 సీట్లను దక్కించుకుంటామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి తెలిపిన విషయం ..

Update: 2024-03-02 05:53 GMT

AP Assembly Elections

వచ్చే ఎన్నికల్లో మొత్తానికి మొత్తం అంటే 175 సీట్లను దక్కించుకుంటామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో సీట్లన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మూడు స్థానాలపై కన్నేసింది. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టింది వైసీపీ. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తనదైన శైలిలో ఎత్తుగడలు వేస్తోంది. సీఎం జగన్‌ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

మూడు నియోజకవర్గాలే టార్గెట్

ముఖ్యంగా విపక్షంలోని కీలక నేతలు పోటీ చేసే కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నారు సీఎం. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండగా, వైసీపీ తరపున కేఆర్‌జే భరత్‌ను బరిలోకి దించాలని నిర్ణయించారు. మొదటి నుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను మార్చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్ఠానం.

ఇక టీడీపీ నుంచి నారా లోకేష్‌ బరిలో దిగుతున్న మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది వైసీపీ. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను కాదని మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించిన జగన్‌.. చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. వంగా గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. మరి ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్‌ అవుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News