ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్?

లండన్‌ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు

Update: 2023-09-12 09:44 GMT

లండన్‌ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్నారు. సీఎం జగన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ వద్ద సీఎస్‌, మంత్రులు, డీజీపీ స్వాగతం పలికారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు చేసే క్రమంలో జరిగిన పరిణామాలను అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరో వైపు సీఎం జగన్‌ ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ఇప్పటికే సీఎంవో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అపాయింట్‌మెంట్ దొరికితే బుధవారం లేకపోతే ఈ వారంలోనే జగన్‌ ప్రధానిని కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళితే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవ్వనున్నారు. సీఎం జగన్ హస్తిన పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.


Tags:    

Similar News