చంద్రబాబు, రామోజీని నిలదీయండి

ఇంటిపై సంపూర్ణ హక్కులను పేదలకు కల్పించేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని వైఎస్ జగన్ అన్నారు.

Update: 2021-12-21 07:56 GMT

ఇంటిపై సంపూర్ణ హక్కులను పేదలకు కల్పించేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. దానివల్ల వారి ఇంటి విలువ పెరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల ఎనిమిది కోట్ల ఆస్తి లబ్దిదారుల సొంతమవుతుందని జగన్ చెప్పారు. తణుకు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ఓటీఎస్ పథకాన్ని ప్రారంభించారు. ఏ ప్రభుత్వంలో ఇంటిని పొందినా ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు.

రుణాలు చెల్లించకపోవడంతో....
రుణాలు చెల్లించకపోవడంతో ఇన్నాళ్లూ ఇంటిమీద ఏ హక్కు లేకుండా ఉన్నారన్నారు. ఈ పథకం ద్వారా యాభై లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయని చెప్పారు. క్రయవిక్రయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ చేయించకుంటే వివాదరహిత ఆస్తిగా మారుతుందని జగన్ చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయని, చేసుకున్న ఇంటికి తేడాను గమనించాలని జగన్ కోరారు. ఓటీఎస్ పథకాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు విషం చిమ్ముతున్నారన్నారు.
ఈ ప్రశ్నలు వేయండి
ఓటీఎస్ పథకాన్ని జీర్ణించుకోలేని వారికి పేదలు కొన్ని ప్రశ్నలు వేయాలని జగన్ కోరారు. మీకున్నవి, మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్టర్ భూములు అయినప్పుడు, మాకు మాత్రం రిజిస్టర్ భూములను జగన్ ప్రభుత్వం చేస్తుంటే మీకెందుకు కడుపుమంట అని అడగాలన్నారు. మా ఇంటిని ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేటుకు మీరు కొంటారా? అని చంద్రబాబు, రామోజీరావును అడగమని జగన్ అన్నారు. చంద్రబాబు తన పాలనలో కనీసం వడ్డీ మాఫీ చేశారా? అని జగన్ ప్రశ్నించారు.
30 నెలల కాలంలో....
ముప్పయి నెలల కాలంలో లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేశామన్నారు. ప్రతి పథకాన్ని తాను చెప్పిన సమయానికి ఇస్తున్న నేను ఈ పథకం ద్వారా పేదల నుంచి డబ్బులు గుంజుతానా? ఆలోచించుకోమని జగన్ ప్రజలను కోరారు. ఈ పధకం ద్వారా లబ్దిదారులకు పదహారు వేల కోట్ల రూపాయలు లబ్ది జరుగుతుందన్నారు. విపక్షాల మాటలను నమ్మవద్దని జగన్ కోరారు. వారు పేదలకు శత్రువులన్నారు.
రాజధానిలో పేదలకు ఇళ్లంటే....
అమరావతి రాజధాని అని గగ్గోలు పెడుతున్నారని, తాను అదే ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే దానిని న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారన్నారు. ఈ పథకాన్ని రేపు ఉగాది వరకూ పొడిగిస్తున్నట్లు జగన్ తెలిపారు. వీలయినంత ఎక్కువ మంది ఈ పథకాన్ని సద్వినయోగం చేసుకోవాలని జగన్ కోరారు. రానున్న కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలను చేస్తానని జగన్ తెలిపారు.ఈ సందర్భంగా లబ్దిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.


Tags:    

Similar News