28న విశాఖ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
పర్యటనలో భాగంగా అక్కడ వేలాది మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్లపట్టాలు అందజేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 28న విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా అక్కడ వేలాది మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్లపట్టాలు అందజేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. జగన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. విశాఖ నగర శివారులో ఒకేచోట 72 లే అవుట్లను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. వాటి పట్టాలను సీఎం జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు.
రేపు విజయవాడ, మంగళగిరిలలో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న విజయవాడ, మంగళగిరి లలో పర్యటించనున్నారు. విజయవాడ వించిపేటలో షాజహూర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం ముస్లిం మతపెద్దలతో సమావేశం కానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. 27వ తేదీ సాయంత్రం మంగళగిరిలోని గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా కుమారుడి పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు.
కాగా.. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. యూటీఎఫ్ ఉద్యోగులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో.. క్యాంపు కార్యాలయం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.