Tirumala : తిరుమలలో నేడు బాగా తగ్గిన భక్తుల రద్దీ... కారణమిదే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్ మెంట్లన్నీ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. మాడవీధుల్లోనూ భక్తుల సందడి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా బోసిపోయి కనిపిస్తుంది. సాధారణంగా సోమవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. పనిదినాలు కావడంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకునే అవకాశం లేదు. శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువ గా ఉంటుంది. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. మామూలుగా అయితే డిసెంబరు నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తమకు మిగిలిపోయిన సెలవులను ఈ నెలలోనే వినియోగించుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అందులో అధిక బాగం తిరుమలకు వస్తుంటారు. వెంకటేశ్వరస్వామి చెంత తమ మొక్కులు తీర్చుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు తరలి వస్తారు. అందుకే డిసెంబరు, జనవరి నెలల్లో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతుంటాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.