Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. కార్తీక మాసం కావడమే కారణమా?

తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గేలేదు. సోమవారం అయినా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

Update: 2024-11-04 01:57 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గేలేదు. సోమవారం అయినా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో తిరుమలను దర్శించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ మాసంలో స్వామి వారిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ఎక్కువ మంది భక్తుల విశ్వాసం. ఎక్కువగా శివాలయాలకు వెళ్లే భక్తులు ఉన్నప్పటకీ, తిరుమల ఒకసారి కార్తీకమాసంలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళ్లిపోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి కార్తీక మాసంలో భక్తుల సంఖ్య తిరుమలకు రాక ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. నవంబరు మాసం నుంచి జనవరి నెల వరకూ తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంటుంది.

26 కంపార్ట్‌మెంట్లలో...
కార్తీక మాసం కావడం, తర్వాత డిసెంబరు నెలలో క్రిస్మస్ సెలవులు కూడా ఉండటంతో పాటు జనవరి నెలలో సంక్రాంతి సెలవులు వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ మూడు మాసాల్లో తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అందుకే ఆన్ లైన్ లో పెట్టిన టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,489 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,871 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News