Tirumala : తిరుమలలో పోటెత్తిన భక్తులు.. కాంపార్ట్‌మెంట్ల నిండా వేచిఉన్న?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

Update: 2024-08-16 03:46 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. రేపు శనివారం స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించి శుక్రవారమే భక్తులు చేరడంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులతో పాటు అప్పటికప్పుడు స్వామి వారిని దర్శించుకుని వెళదామని వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తిరుమలలో ఏ వీధిలో చూసినా భక్తులే. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు కాలి నడకన కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో వారికి స్పెషల్ టోకెన్లను టీటీడీ అధికారులు జారీ చేస్తున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా భక్తులకు ఇబ్బందికరంగా మారింది. రేపు, ఎల్లుండి కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పదహారు గంటలు...
అందుకు తగినట్లు ఆలయ అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకున్న భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,695 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,395 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News