Tirumala : తిరుమలలో పెరగని భక్తులు.. ఈజీగానే స్వామి వారి దర్శనానికి
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గత నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి.;

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గత నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి. గురువారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని తిరుమల తిరుపతిదేవస్థానం అధికారులు చెబుతున్నారు. తిరుమలకు గత కొద్ది రోజులుగా భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది. రోజుకు మూడు కోట్ల రూపాయల పైనే హుండీ ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. కంపార్ట్ మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే ఏడుకొండల వాడిని భక్తులు దర్శించుకుంటున్నారు.
ఈ మూడు నెలలు...
ఇక మార్చి నెల చివర వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వరసగా పరీక్షలు మార్చి నెలలో ప్రారంభమై ఏప్రిల్ నెల వరకూ కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ అంతగా ఉండదని, ప్రతి ఏటా ఈ సీజన్ లో భక్తుల సంఖ్య కొంత తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. తిరుమలకు ప్రత్యేకంగా ఎలాంటి సీజన్ లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యులతో వచ్చే వారు ఎక్కువ మంది ఈ మూడు నెలలు కొంత ఆసక్తి చూపరు.
మూడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.14 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు వెల్లడించారు.