Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు.

Update: 2024-12-04 03:24 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. కంపార్ట్ మెంట్లు చాలా వరకూ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అలాగే మాడ వీధుల్లో కూడా భక్తుల సంచారం పెద్దగా కనిపించడం లేదు. చలి తీవ్రత, వర్షాల కారణంతో పాటు వారం మధ్య కావడంతో తిరుమలలో రద్దీ స్వల్పంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఈ సీజన్ లో ఎక్కువ మంది వచ్చే అవకాశముంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో పాటు ప్రయివేటు సంస్థల్లోపనిచేస్తున్న వారికి డిసెంబరు నెల కావడంతో తాము వినియోగించుకోని సెలవులు ఎక్కువగా ఉంటాయి. ఈ సెలవులలో తిరుమలను దర్శించుకుని శ్రీవారి వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే డిసెంబరు నెల మొత్తం తిరుమలకు భక్తుల రద్దీ సహజంగా ఎక్కువగా ఉంటుందన్న అంచనాలో ఉన్నారు. తిరిగి ఎల్లుండి నుంచి భక్తుల రద్దీ ఎక్కువ కానుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ ఎక్కువయినా అత్యంత వేగంగా స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఒక కంపార్ట్ మెంట్ లోనే...
తిరుమలలో భక్తుల రద్దీ డిసెంబరు, జనవరి నెలలో ఎక్కువగా ఉంటుంది. జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలను కూడా అధికారులు రద్దు చేయనున్నారు. అందుకే డిసెంబరు, జనవరి మాసాలలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయంలో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,301 మంది దర్శించుకున్నారు. వీరిలో 20,222 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News