Tiruamala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

Update: 2024-10-04 04:17 GMT

Tirumala darshan

తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. నేడు శుక్రవారం కావడంతో ఎప్పుడూ ఉండే రద్దీతో పాటు బ్రహ్మోత్సవాల రద్దీ కూడా ప్రారంభమయింది. తిరుమలలోని అన్ని వీధులు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడా కనీసం నిల్చోటానికి కూడా వీలులేకుండా భక్తుల సంఖ్య ఉందని చెబుతున్నారు. దర్శనం కూడా అత్యధిక సమయం పడుతుంది. బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కానుండటంతో భక్తుల రాక మరింతగా పెరుగుతుందని అంచనా వేశారు. అందుకు తగినట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో కేవలం క్యూ లైన్ లో మాత్రమే కాదు. అన్ని చోట్ల అంటే తలనీలాలను సమర్పించే చోట, అన్నదాన సత్రంలోనూ భక్తులు అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ తనిఖీలు కూడా ముమ్మరం చేసింది.

18 గంటల సమయం...
తిరుమలలో ఈ తొమ్మిది రోజుల పాటు భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అన్ని రకాల ఆంక్షలను పెట్టారు. ప్రయివేటు ట్యాక్సీలను కూడా తిరుమల కొండపైకి తొమ్మిది రోజుల పాటు అనుమతించడం లేదు. గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలపై కూడా నిషేధం విధించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,376 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,146 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుమలకు చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.


Tags:    

Similar News