Ys Jagan : మోసానికి మారు పేరు చంద్రబాబు.. నమ్మితే మోసపోయినట్లే

చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏనాడైనా అమలు చేశారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పూతలపట్టులో ఆయన ప్రసంగించారు

Update: 2024-04-03 13:26 GMT

చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏనాడైనా అమలు చేశారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. నమ్మించి మోసం చేేసే నైజం చంద్రబాబుది అని అన్నారు. 2014లో మ్యానిఫేస్టోలో పెట్టిన ముఖ్యమైన హామీలను అమలుపర్చకుండా నిలువునా మోసం చేశారన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, బెంజ్ కారు ఇస్తామంటున్నాడని, మరి చంద్రబాబును నమ్మొచ్చా అని జగన్ ప్రశ్నించారు. వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బంది పెట్టే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడని జగన్ అన్నారు. వారిని కూడా పథకం ప్రకారం పక్కన పెట్టించే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థనే రద్దు చేస్తారని అన్నారు. చంద్రబాబు మనిషా? శాడిస్టా అని ప్రశ్నించారు.

మంచికి.. చెడుకు మధ్య యుద్ధం...
ఈ ఎన్నికలు జగన్ కు,చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదని, మంచికి, చెడుకు మధ్య అని అన్నారు. అన్ని జెండాలు, ఇన్ని పార్టీలూ ఒక్కడిని ఓడించడానికి ఏకంకావాలా? అని ఆయన ప్రశ్నించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి డబుల్ సెంచరీ సర్కార్ ఏర్పాటయ్యేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశారా? అని జగన్ ప్రశ్నించారు. పదేళ్ల మీ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకుంటే ఎవరి హయాంలో మేలు జరిగిందన్నది అర్థమవుతుందని జగన్ అన్నారు. ఈ యుద్ధంలో తనది ప్రజల పక్షమయితే.. వారిది పెత్తందారుల పక్షమని అన్నారు.
ఇంటివద్దకే పింఛను ఇచ్చి...
ఈ ఓటువల్ల మన తలరాతలు మారతాయని ఆయన గుర్తు చేశారు. ఒకటోతేదీ వచ్చే సరికి ఇంటి వద్దకే పింఛను ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో మీకు మంచి జరిగిందో ఆలోచించుకోవాలని అన్నారు. ఇంటికి వెళ్లి అందరూ కూర్చుని ఆలోచించుకుని ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు. విశ్వసనీయత ఎవరికుందో ఆలోచించాలన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారికి మంచి చేయడానికే యాభై ఎనిమిది నెలలు ప్రయత్నం చేశామని తెలిపారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఎవరు నిర్మించారని ఆయన ప్రశ్నించారు. విలేజ్ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని మించి కార్పొరేట్ వైద్య సేవలను పేదలకు అందించామని తెలిపారు.
సంస్కరణలు తెచ్చి...
విద్యారంగంలో సంస్కరణలు తెచ్చింది ఎవరని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పేదపిల్లలకు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయడమే కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. 130 సార్లు బటన్ నొక్కి 2.70 లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని ఆయన చెప్పారు. వైఎస్సార్ పింఛను కింద దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది ఈ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై చంద్రబాబు కూటమి ఎలా అక్కసు గక్కుతుందో చూస్తూనే ఉన్నారన్నారు. వారితో యుద్ధం చేయడానికి తాను సిద్ధమని, మీరు సిద్ధమా? అని జగన్ ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది నిజం కాదా? అని అన్నారు.


Tags:    

Similar News