Chandrababu : వైసీపీ జెండా పీకేయడం ఖాయం.. రెడీ గా ఉండండి.. అధికారం మనదే

రాష్ట్రానికి వైసీపీ అవసరమా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ని ఓడించేందుకు జనం సిద్దంగా ఉన్నారని తెలిపారు

Update: 2024-01-27 11:22 GMT

రాష్ట్రానికి వైసీపీ అవసరమా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.జగన్ ని ఓడించేందుకు జనం సిద్దంగా ఉన్నారని తెలిపారు. రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దమని ఆయన తెలిపారు. వైసీపీకి అభ్యర్దులు దొరకటం లేదన్న చంద్రబాబు వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అని ప్రశ్నించాలన్నారు. వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రమయ్యాయని తెలిపారు. నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అన్నావ్.. పన్నులు ఎందుకు వేశావ్ అని ప్రశ్నించారు. అప్పులు ఎందుకు చేశావు జగన్ అని నిలదీశారు. చేసిన అప్పులు ఎవరు కడతారు? అని నిలదీశారు. దోచిందంతా అధికారంలోకి రాగానే కక్కిస్తామని టీడీపీ అధినేత అన్నారు.

ముద్దులకు మురిసిపోయి...
ఎన్నికలయ్యాక వైసీపీ జెండా పీకేయటం ఖాయమన్న చంద్రబాబు, గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? అని ప్రశ్నించారు. తాను రాయలసీమ బిడ్డనే నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమేనని అన్నారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని అన్నారు.
రాయలసీమను...
రాయలసీమను పండ్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశానని చెప్పిన చంద్రబాబు, దుర్మార్గులు అంతా నాశనం చేశారని ఆవేదన చెందారు. నాడు 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాని, కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారని, ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టారా? అని ప్రశ్నించారు.. మద్య నిషేదంపై మాట తప్పి మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో పేదల రక్తం తాగుతున్నారన్న చంద్రబాబు, మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకులేవు? అంటూ ఫైర్ అయ్యారు. నాటి కంటే నేడు బడ్జెట్ పెరిగిందని, కేంద్రం నిధులు పెరిగాయని, కానీ పన్నులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. ఈసారి టీడీపీ, జనసేన గెలుపు ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఈసారైనా జాగ్రత్తగా చూసి ఓట్లేయాలని ఆయన పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News