TDP : సీనియర్లకు మళ్లీ షాకిచ్చే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. వారిని వదిలించుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి యాభై ఏళ్లవుతుంది. ఆ పార్టీలో కావాల్సినంత మంది సీనియర్లున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి యాభై ఏళ్లవుతుంది. ఆ పార్టీలో కావాల్సినంత మంది సీినియర్లున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా సీనియర్ నేతలే. 2019 వరకూ చంద్రబాబు సీనియర్లకు ప్రయారిటీ ఇచ్చేవారు. ఏ విషయంలోనైనా వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లేవారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. సీనియర్ నేతలు పార్టీకి తెల్ల ఏనుగుల్లా తయారయ్యారని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. గతంలో ఉన్న జనరేషన్ వేరు. ఇప్పుడున్న జనరేషన్ వేరు. దూసుకెళ్లే మనస్తత్వం కావాల్సిన వారే పార్టీకి అవసరం. అల కాకుండా పార్టీ కార్యాలయంలోనో, నియోజకవర్గంలో తన ఇంట్లో కూర్చుంటే పార్టీకి ఫ్యూచర్ లో ఇబ్బందులు తప్పవు.
విజయం వన్ సైడ్ కావడంతో...
మొన్నటి ఎన్నికల సమయంలోనే అనేక మంది సీనియర్ నేతలు చంద్రబాబు తెలివిగా వదిలించుకున్నారు. కొందరికి సీట్లను తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినప్పటికీ వారికి మంత్రి పదవులకు దూరంగా ఉంచారు. కానీ ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే వన్ సైడ్ విజయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో తన వ్యూహాన్ని మార్చారు. భవిష్యత్ లో పార్టీకి ఉపయోగపడే వారికే పదవులు ఉంటాయని ఒక రకంగా బలమైన సంకేతాలు పంపారు. సీనియర్లు రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకుంటే మంచిదని కూడా ఆయన టీడీపీ లో ఒక రకమైన సిగ్నల్స్ ను పంపగలిగారంటే మనం ఏ స్థాయిలో ఆయన ఆలోచనలున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నియోజకవర్గాల్లో...
ఇక త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో కూడా సీనియర్లు ఎవరూ ఉండరని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలకు, పార్టీ కోసం గత ఐదేళ్లు కష్టపడిన వారికి మాత్రమే పదవులు లభించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఆయన వెంట సీనియర్ నేతలుండే వారు. ఢిల్లీకి వెళితే కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి నేతలుండే వారు. అలాగే తుర్లపాటి కుటుంబరావు లాంటి వారిని సలహాదారులుగా నియమించుకున్నారు. కానీ ఈసారి చంద్రబాబు తన రూట్ ను మార్చినట్లు తెలిసింది. ఢిల్లీ లో పార్టీ తరుపున వ్యవహారాలను చక్క బెట్టేందుకు గల్లా జయదేవ్ ను నియమిస్తారన్న ప్రచారం జరుగుతుంది.
నామినేటెడ్ పోస్టుల...
ఇక రాష‌్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ యువతకే ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల కోసం జాబితాను ఆయన రూపొందించారు. సీనియర్ నేతలను కేవలం పార్టీలోని పొలిటి్ బ్యూరో, లేదా ఇతర కీలక కమిటీలో భాగస్వామ్యులను మాత్రమే చేసి వారిని అక్కడే పరిమితం చేయాలని ఆయన ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకూ ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చే అవకాశముందని తెలిసింది. టీడీపీలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో 90 శాతం మంది యువతకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి సీనియర్లకు ఈ ఆశలు కూడా గల్లంతయినట్లేనా?