శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుతుండటంతో.. వర్షపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదులుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 23 వేల క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 808.9 అడుగులుగా ఉంది. జూరాలకు 41 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 8.75 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలకు భారీస్థాయిలో వరదనీరు వస్తుండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే వరదనీటిలో మునిగిపోయాయి. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1785.85 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ కు ప్రస్తుతం 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
హిమాయత్ సాగర్ కు 1500 క్యూసెక్కుల వరద వస్తోంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1762.50 అడుగులకు చేరింది. దాంతో హిమాయత్ సాగర్ 4 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,750 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసీలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును మూసివేశారు. రాజేంద్రనగర్ వైపు వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 43.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుండగా.. 9,55,828 క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.