మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత
భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం విషపూరితమైందని గుర్తించి, అస్వస్థతకు గురైన..;
అమలాపురం : మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కోనసీమ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని అమలాపురం పరిధిలో ఉన్న కిమ్స్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కొనసాగుతోంది. నర్సింగ్ కళాశాలకు చెందిన హాస్టల్ లో గురువారం మధ్యాహ్నం బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ విద్యార్థినులు భోజనం చేశారు.
భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం విషపూరితమైందని గుర్తించి, అస్వస్థతకు గురైన విద్యార్థినులందరికీ హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది కళాశాల యాజమాన్యం. కాగా.. ఒకేసారి 50 మంది అస్వస్థతకు గురి కావడంపై కళాశాల యాజమాన్యం ఆందోళన చెందుతోంది. హాస్టల్ ఫుడ్ ఎలా విషపూరితమైందన్న అంశంపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసింది.